‘కల్తీ’ ప్రచారకులపై చర్యలు తీసుకోండి
పరిగి: శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ కల్తీ ప్రచారం చేసి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేష్‌లపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆమె పరిగి మండలంలో పర్యటించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్లు భూమన కరుణాకరరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి దుష్ప్రచారానికి ఒడిగట్టిన కూటమి నాయకులపై చర్యలు తీసుకోవాలని పరిగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టర్లను తయారు చేస్తున్న ముద్రణ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ... కేంద్ర దర్యాప్తు సంస్థ నిర్వహించిన విచారణలో టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదన్న విషయం బట్టబయలైందన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను తప్పించుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, అందులో భాగంగా కల్తీ నెయ్యి అంటూ వెంకన్న భక్తులను మానసికక్షోభకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ కాలేదని ల్యాబ్ రిపోర్టు స్పష్టంగా చెప్పినా... కూటమి నేతలు అసత్య ప్రచారాన్ని ఆపకపోవడం దుర్మార్గమన్నారు. కల్తీ అంటూ ఇప్పటికీ అసత్య ప్రచారం చేస్తున్న చంద్రబాబు, పవన్, లోకేష్ శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలని, శ్రీవారి మెట్లు కడిగి ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు.
దాడులకు కర్త, కర్మ, క్రియ చంద్రబాబే..
వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు కర్త, కర్మ, క్రియ అన్నీ సీఎం చంద్రబాబేనని ఉషశ్రీచరణ్ ఆరోపించారు. రాష్ట్రానికి పట్టిన అరిష్టాలన్నీ తొలగిపోవాలంటూ గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు పూజలు చేసేందుకు ఆలయానికి వెళ్తే ఆయనపై కర్రలు, రాళ్లతో దాడికి సిద్ధమైన టీడీపీ గూండాలను పోలీసులు నిలువరించపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఐదు గంటల పాటు దాడులు చేసినా పట్టించుకోకుండా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం, ఆపై దాడులు చేసిన వారిని విడిచిపెట్టడం చూస్తే దీని వెనుక చాలా పెద్ద వ్యక్తులు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి, రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చిన చంద్రబాబుకు పాలించే హక్కు లేదని, రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు.
బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని ఉపేక్షించబోం
సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు రావాల్సిన బిల్లులను పక్షపాత ధోరణితో జాప్యం చేస్తే ఉపేక్షించబోమని, త్వరలోనే పెనుకొండలో ధర్నా నిర్వహిస్తామని ఉషశ్రీచరణ్ హెచ్చరించారు. అప్పులు చేసి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులకు రావాల్సిన బిల్లులను మంజూరు చేయకుండా మంత్రి సవిత కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులకు బిల్లులు చేయొద్దని సాక్షాత్తు ఓఎస్డీ సుమన జయంతి చెప్పడాన్ని ఖండించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నరసింహమూర్తి, ఎంపీపీ సవిత, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
లడ్డూకు వాడే నెయ్యి కల్తీ అంటూ భక్తుల మనోభావాలు దెబ్బతీశారు
కల్తీ లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చినా చంద్రబాబుకు బుద్ధిరాలేదు
వైఎస్ జగన్ ఫ్లెక్సీలతో
దుష్ప్రచారాన్ని చేస్తే ఊరుకోం
పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్
‘కల్తీ’ ప్రచారకులపై చర్యలు తీసుకోండి


