కొత్త రైల్వేలైన్లకు నిధులు కష్టమే
● డీఆర్‌ఎం సీఎస్ గుప్తా
గుంతకల్లు: కేంద్రం ప్రవేశపెట్టిన 2026–2027 బడ్జెట్‌లో గుంతకల్లు రైల్వే డివిజన్‌లో కొత్త రైల్వే లైన్లకు నిధులు దక్కడం కష్టమేనని డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తా అభిప్రాయపడ్డారు. రైల్వే మంత్రి అశ్వనివైష్టవ్ ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో సమావేశాన్ని అధికారులు డీఆర్‌ఎం కార్యాలయంలో సోమవారం సాయంత్రం వీక్షించారు. అనంతరం డీఆర్‌ఎం మాట్లాడుతూ ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు రూ.10,134 కోట్లు, తెలంగాణకు రూ.4,000 కోట్లకు పైగా రైల్వేకు కేటాయించినట్లు తెలిపారు. హైదరాబాద్ వయా అమరావతి మీదుగా చైన్నె, హైదరాబాద్ – బెంగళూరు మధ్య హై స్పీడ్ డైమండ్ ప్రాజెక్ట్ (హై స్పీడ్ ప్రత్యేక రైల్ మార్గం)ను ఏర్పాటు చేసేందుకు అనుమతులు లభించాయన్నారు. దీంతో ఇండియన్ రైల్వే మరో చరిత్ర సృష్టించబోతోందన్నారు. అయితే కొత్త రైల్వే లెన్లకు దేశవ్యాప్తంగా రూ.36 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, దీంతో తమ డివిజన్‌కు కొత్త రైల్వే లైన్లకు నిధులు కేటాయింపులు ఉండకపోవచ్చని పేర్కొన్నారు. డివిజన్‌కు రైల్వే నిధుల కేటాయింపులపై పింక్ బుక్ విడుదల అనంతరం పూర్తిస్థాయిలో తెలుస్తాయన్నారు. ఇక దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు చుర్గుగా సాగుతున్నాయని, పూర్తి స్థాయి జోనల్ ఏర్పాటు చేసుకోవడానికి మరో మూడేళ్లపైగా సమయం పడుతుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ డీసీఎం మనోజ్, సీనియర్ డీఓఎం శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
క్వింటా చింతపండు
రూ.23 వేలు
హిందూపురం: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో చింతపండు విక్రయాలు ఊపందుకున్నాయి. సోమవారం మార్కెట్‌కు 1,500 క్వింటాళ్ల చింతపండు రాగా, క్వింటా (కరిపులి రకం) గరిష్టంగా రూ.23 వేలు, కనిష్టంగా రూ.10 వేల ప్రకారం క్రయవిక్రయాలు జరిగాయని మార్కెట్ కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు. ఇక ఫ్లవర్ రంక క్వింటాల్ గరిష్టంగా రూ.18 వేలు, కనిష్టంగా రూ.6 వేల ప్రకారం ధర పలికిందని ఆయన వెల్లడించారు. ప్రతి సోమ, గురువారాల్లో చింతపండు, మంగళ, శుక్రవారాల్లో ఎండుమిర్చి క్రయ విక్రయాలు జరుగుతున్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కార్యదర్శి సూచించారు.
రేపు ఎంపీపీ,
వైస్ ఎంపీపీల ఎన్నిక
రొళ్ల: స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ, ఇద్దరు వైస్ ఎంపీపీల ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఎంపీడీఓ నాగేశ్వరశాస్త్రి 11 మంది ఎంపీటీసీ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. ఎన్నికకు ప్రొసీడింగ్ ఆఫీసర్‌గా ఆర్డీఓ ఆనంద్‌కుమార్ వ్యవహరిస్తారని ఆయన వెల్లడించారు. ఎన్నిక నేపథ్యంలో బుధవారం బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 అమలులో ఉంటుందని తహసీల్దార్ షేక్షావలి తెలిపారు. ఈ ఎన్నికను 11 మంది ఎంపీటీసీ సభ్యులతో పాటు గుర్తించిన పత్రిక విలేకరులు మాత్రమే హాజరు కావాల్సి ఉందన్నారు. బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163ను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.
కొత్త రైల్వేలైన్లకు నిధులు కష్టమే


