నాణ్యమైన పరిష్కారం చూపండి
ప్రశాంతినిలయం: ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందే అర్జీలను నాణ్యతతో పరిష్కరించి ప్రజల్లో వ్యవస్థపై నమ్మకం కలిగించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పరిష్కార వేదికకు వివిధ సమస్సపై 203 అర్జీలు వచ్చాయి. వీటిని వెంటనే ఆయా శాఖలకు పంపి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో పాల్గొన్న జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓ సువర్ణ తదితరులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
రెవెన్యూ క్లినిక్‌లతో సమస్యలకు పరిష్కారం..
రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా ఏళ్ల నాటి సమస్యలకు పరిష్కారం దొరుకుతోందని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌లను ఆయన సందర్శించారు. రెవెన్యూ సమస్యలున్న వారు రెవెన్యూ క్లినిక్‌లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా డివిజన్ల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, ఆయా రెవెన్యూ డివిజన్‌ల ఆర్డీఓలు అక్కడే ఉండి ఫిర్యాదులు స్వీకరించారు. కొన్ని రెవెన్యూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
● కదిరి ఆర్టీసీ డిపోలో పనిచేస్తూ 2025 ఆగస్టు 31వ తేదీన తామంతా పదవీ విరమణ పొందామని, ఇంతవరకూ తమకు రావాల్సిన గ్రాట్యుటీ రూ.13.67 లక్షలు, లీవుల డబ్బు రూ.6.13 లక్షలు మంజూరు కాలేదని పలువురు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు కలెక్టర్‌కు తెలిపారు. పదవీ విరమణ ప్రయోజనాలు అందక తమ కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయన్నారు. అలాగే తమకు రూ.9,645 మాత్రమే పింఛన్ వస్తుందని, అందువల్ల రేషన్ కార్డు ఇప్పించాలని కోరారు.
● తనకు ప్రమాదంలో ఒక కాలు పోయిందని 90 శాతం అంగవైకల్యం ఉన్నా.. ప్రభుత్వం కేవలం రూ.4 వేల పింఛన్ మంజూరు చేసిందని తలుపుల మండలం వీఆర్ తండాకు చెందిన రామునాయక్ కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. 70 ఏళ్ల వయస్సులో ఏ పనీ చేసుకోలేని తన పరిస్థితి అర్థం చేసుకుని రూ.15 వేల పింఛన్ ఇప్పించాలని కోరారు.
అధికారులకు కలెక్టర్
శ్యాంప్రసాద్ ఆదేశం
పరిష్కార వేదికకు 203 అర్జీలు
నాణ్యమైన పరిష్కారం చూపండి
నాణ్యమైన పరిష్కారం చూపండి


