రేపు ప్రత్యేక విద్యుత్ అదాలత్
పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 4వ తేదీన ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు డీఈ శివరాములు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్థానిక గణేష్ సర్కిల్ సమీపంలోని సబ్ డివిజన్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం 3.30 గంటల నుంచి 5.30 గంటల వరకు అదాలత్ ఉంటుందన్నారు. విద్యుత్ సబ్‌డివిజన్ పరిధిలోని పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం, ధర్మవరం మున్సిపాలిటీ, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం రూరల్, బత్తలపల్లి, తాడిమర్రి, రామగిరి, కనగానిపల్లి మండలాల విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను రాత పూర్వకంగా తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు.
బాల్య వివాహాలను అరికడదాం
● కలెక్టర్ శ్యాంప్రసాద్,
ఎస్పీ సతీష్‌కుమార్ పిలుపు
పుట్టపర్తి అర్బన్/పుట్టపర్తి టౌన్: బాల్య వివాహాలను అరికట్టేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్ పిలుపునిచ్చారు. బాల్య వివాహాల వల్లే కలిగే అనర్థాలను ప్రజలకు వివరించేందుకు ఐసీడీఎస్, రెడ్స్, శక్తి టీం సంయుక్త ఆధ్వర్యంలో 100 రోజుల క్యాంపెయిన్ కోసం బాల్య వివాహ ముక్తి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ రథాలను సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ శ్యాంప్రసాద్, జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సతీష్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ... ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించవచ్చన్నారు. ఇందు కోసం రథయాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు. మొదటి విడతగా కదిరి, పుట్టపర్తి డివిజన్‌లలో ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాల్య వివాహ వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి గ్రామంలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, ఐసీడీఎస్ పీడీ ప్రమీల, రెడ్స్ డైరెక్టర్ భానుజా పాల్గొన్నారు.


