సాంఘిక అసమానతలను ప్రశ్నించాలి
అనంతపురం కల్చరల్: ప్రజా సమస్యలు, సామాజిక అసమానతలు, దోపిడీ వ్యవస్థలను సాహిత్యం ద్వారా ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అభినందనీయమని అభ్యుదయ రచయితలను అరసం రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి అభినందించారు. అరసం (అభ్యుదయ రచయితల సంఘం) ఆధ్వర్యంలో 90 ఏళ్ల అభ్యుదయ సాహిత్యం కార్యక్రమంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం అనంతపురంలోని ఎకాలజీ సెంటర్‌లో జరిగింది. రాష్ట్రం నలుమూలల నుండి రచయితలు, కవులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భారతీయ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు పెనుకొండ లక్ష్మీనారాయణ, డాక్టర్ రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్ జీవన సాఫల్య అవార్డు గ్రహీత డాక్టర్ శాంతినారాయణ, రాజారాం తదితరులు ప్రసంగించారు. సమాజాన్ని నెలకొల్పే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉందన్నారు. ప్రజల పక్షాన కవులు, కళాకారులు నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం అరసం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో బోధన భాష వరకు తెలుగు మాత్రమే ఉండాలని, దాని స్థానంలో హిందీ అమలును ప్రతిఘటించాలని, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులను ప్రకటించే తరుణంలో కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకించాలని తీర్మానించారు. పలు పుస్తకాల సమీక్షలు జరిగాయి. విశాఖపట్టణానికి చెందిన బసు పోతన రచించిన ‘మనిషి జాడను వెతుక్కుంటూ’ అనే కవితా సంపుటిని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అరసం ప్రధాన కార్యదర్శి తన్నీరు నాగేంద్ర, సీనియర్ రచయితలు తరిమెల అమరనాథరెడ్డి, జనప్రియ కవి ఏలూరు యంగన్న, కడప ఈశ్వరరెడ్డి, ఉప్పరపాటి వెంకటేశులు, మధురశ్రీ, చెట్ల ఈరన్న, కొత్తపల్లి సురేష్, శేషగిరి రాయుడు, గోసల నారాయణస్వామి, యమున, విద్యావతి తదితరులు పాల్గొన్నారు.
ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి


