విద్యుత్ సక్రమంగా సరఫరా చేయరా?
అమరాపురం: మండల పరిధిలోని నిద్రగట్ట గ్రామ పంచాయతీ పరిధిలో విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేయడం లేదంటూ శనివారం హేమావతి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను రైతులు ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరగంటకోసారి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండడంతో మోటార్లు కాలిపోతున్నాయని వాపోయారు. విద్యుత్ శాఖాధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. ప్రజా ప్రతినిధులు స్పందించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు వచ్చే వరకు కదిలే ప్రసక్తే లేదంటూ భీష్మించారు. ఏఈ సిద్దేశ్వర అక్కడికి చేరుకుని విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తానని, మూడు రోజులు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో రైతులు నిరసన విరమించారు. కార్యక్రమంలో రైతులు శ్రీనివాస్, అశోక్, ఈరన్న, మంజునాథ, నటరాజు, రవి, రాజు, నరసింహప్ప, నరసింహమూర్తి, చిక్క నరసప్ప, రాజన్న, నాగరాజు, నరసింహప్ప, జంపన్న, యలె రంగ, పరమేష్, తదితరులు పాల్గొన్నారు.


