లక్ష్యానికి తూట్లు !
నల్లచెరువు: గ్రామీణ ప్రజల ఆరోగ్య స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆయుష్‌మాన్ భారత్ హెల్త్ అథారిటీ కింద ఎన్‌సీడీ–డీసీ 4.0 సర్వే చేపట్టింది. సాంక్రమికేతర (నాన్ కమ్యూనికేషన్ డీసీజెస్) వ్యాధులను గుర్తించేందుకు సర్వేకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు కలిసి గ్రామాల్లోని ప్రతి ఇంటినీ సందర్శించి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకొని యాప్ ద్వారా ఆన్‌లైన్ చేయాల్సి ఉంది. అయితే వైద్య సిబ్బంది మాత్రం ఇవేవీ తమకు పట్టనట్లే వ్యవహరిస్తూ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా సర్వే పర్సెంటేజీ కోసం ఆయా గ్రామాల్లోని వ్యక్తుల వివరాలను ఇష్టం వచ్చిన రీతిలో నమోదు చేస్తున్నార్న విమర్శలున్నాయి. సర్వే నిర్వహణ తీరును పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో క్షేత్రస్థాయిలో సర్వే లక్ష్యం నీరుగారుతోంది.
ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు కలిసి వారి పరిధిలలో రోజూ నాలుగు కుటుంబాలను సందర్శించి ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని పక్కాగా నమోదు చేయాలి. బరువు, ఎత్తుతో పాటు బీడీ, సిగరెట్, మద్యం, ఇతర మత్తు పదార్థాలు సేవిస్తున్నారా? అని అడిగి తెలుసుకోవాల్సి ఉంది. అలాగే వివిధ వ్యాధులు ఏమైనా ఉన్నాయా అని పరీక్షించాల్సి ఉంది. వివరాలను పక్కాగా సేకరించి యాప్‌లో నమోదు చేయాలి. సంబంధిత వ్యక్తులకు ఎవరికై నా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే ఆ వ్యక్తిని పరీక్షించేందుకు ఆస్పత్రికి పిలిపించి పూర్తిస్థాయిలో పరీక్షలు చేయాల్సి ఉంది. తీవ్రమైన ఆరోగ్య ఉన్నవారిని గుర్తించి జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేయాలి. ఈ సర్వే ద్వారానే స్థానిక ఆస్పత్రుల్లో ఎలాంటి మందులు అవసరమో అవి పంపుతారు.
ఎన్‌సీడీ–డీసీ 4.0 సర్వే చేయడానికి వైద్యారోగ్య సిబ్బంది గ్రామాల్లోని ఇళ్లకు వెళ్లడం లేదు. ఏదో ఒక చోట కూర్చొని యాప్‌లో తోచిన విధంగా వివరాలు నమోదు చేస్తున్నారు. గ్రామంలోని ఆయా కుటుంబాల ఫోన్ నంబర్లు సేకరించి ఫోన్ ద్వారా ఓటీపీలు చెప్పించుకొని సర్వేను మమ అనిపించేస్తున్నారు. కనీసం ఫోన్‌లో కూడా ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీయడం లేదని ప్రజలే చెబుతున్నారు. హెల్త్ సర్వే చేస్తున్నాం.. మీ నంబర్‌కు ఓటీపీ వచ్చింది చెప్పడంటూ సర్వే పూర్తి చేస్తున్నారు. అయితే సర్వే చేస్తున్నట్లు మాత్రం ఫొటోలకు ఫోజులు ఇచ్చి అప్‌లోడ్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి.
పేదల ఆరోగ్య స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్‌సీడీ–డీసీ 4.0 సర్వే గాడి తప్పింది. కేవలం ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ఫోన్లు చేసి ఓటీపీలు తెలుసుకొని సర్వేను వైద్యసిబ్బంది మమ
అనిపిస్తున్నారు. అంతా తెలిసినా
వైద్యాధికారులు, ఉన్నతాధికారులు కూడా చోద్యం చూస్తున్నారు.
గాడితప్పిన ఎన్‌సీడీ–డీసీ 4.0 సర్వే
ఫోన్లు చేసి ఓటీపీలతో మమ అనిపిస్తున్న వైద్య సిబ్బంది
సర్వే చేస్తున్నట్లు ఫొటోలకు ఫోజులు
పట్టించుకోని ఉన్నతాధికారులు
ఓటీపీలతోనే సరి..
సర్వే చేయాల్సింది ఇలా...


