తప్పులను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్
● వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త
టీఎన్ దీపిక
చిలమత్తూరు: చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ, జనసేన డైవర్సన్ పాలిటిక్స్‌కు తెరతీశాయని వైఎస్సార్‌సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక విమర్శించారు. శుక్రవారం హిందూపురంలోని పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగి తిరుమల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల కోసం ఎంతటి నీచానికై నా దిగజారే మనస్తత్వం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు ఉందనే విషయాన్ని ప్రజలే మాట్లాడుకుంటున్నారన్నారు. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ మహిళతో ఎంత అసభ్యకరంగా ప్రవర్తించారో అందరికి తెలుసన్నారు. అలాంటి వ్యక్తి ప్రజా ప్రతినిధిగా ఉండటం దురదృష్టకరమన్నారు. రెండేళ్లుగా టీడీపీ, జనసేన నాయకులు చేయని అకృత్యాలు లేవని మండిపడ్డారు. హత్యలు, అత్యాచారాలు, అక్రమాలు ఇరు పార్టీలు పోటీ పడి చేస్తున్నాయన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఎలాంటి కల్తీ జరగలేదని, ఉద్దేశ పూర్వకంగా తిరుమలపై రాజకీయాలు చేయడం సిగ్గుచేటని, తగిన సమయంలో భగవంతుడే తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు.


