రైతులకు యూరియా కష్టాలు
పుట్టపర్తి టౌన్: రైతులకు రబీలోనూ యూరియా కష్టాలు తప్పడం లేదు. అధికారులకు సరైన ప్రణాళిక లేకపోవడం... పాలకులు పట్టించుకోకపోవడంతో బస్తా యూరియా కోసం రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం పుట్టపర్తి సహకార సంఘం ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేపట్టారు. దీంతో మున్సిపాటిలీ పరిధిలోని రైతులంతా ఉదయమే సొసైటీ కార్యాలయం ఎదుట బారులు తీరారు. సొసైటీకి కేవలం 280 బస్తాల యూరియానే రావడంతో అధికారులు ఒక్కో రైతుకు ఒక్క బస్తా యూరియానే పంపిణీ చేశారు. ఈ క్రమంలో పలువురు రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉదయమే వచ్చి క్యూలో నిల్చున్నా ఒక్క బస్తా ఇస్తే ఏం చేసుకోవాలంటూ మండిపడ్డారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అయితే రైతు భరోసా కేంద్రాల్లోనే సకాలంలో ఆయా సీజన్లలకు విత్తనాలు, ఎరువులు అందించేవారని, ప్రస్తుత ప్రభుత్వంలో రబీలోనూ యూరియా కోసం ఇబ్బంది పడాల్సి వస్తోందని మండిపడ్డారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా పంపిణీ చేయాలని కోరారు.
పుట్టపర్తి సొసైటీ కార్యాలయం
ఎదుట బారులు
ఒక్కో రైతుకు బస్తా యూరియా మాత్రమే ఇవ్వడంపై ఆగ్రహం


