మహాత్ముడు మళ్లీ పుట్టాలి
పరిగి/హిందూపురం: భారతజాతికి స్వేచ్ఛావాయువుల కొనసాగింపునకు జాతిపిత మహాత్మాగాంధీ మళ్లీ పుట్టాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. మండలంలోని సేవామందిరంలోని ఏఎం లింగణ్ణ విద్యాసంస్థల ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల క్రితం మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురం నుంచి మహాత్మాగాంధీ సందేశ్ యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. హిందూపురం వరకూ చేపట్టిన యాత్రలో భాగంగా చివరి రోజు శుక్రవారం సేవామందిరం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం హిందూపురం పట్టణంలోని గాంధీ సర్కిల్ వరకు పాదయాత్రగా నడిచి వచ్చి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముగింపు సభలో రఘువీర మాట్లాడుతూ ఇటీవల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరును మార్చడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గొప్ప పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తుండటం బాధాకరమన్నారు. దేశంలో వివిధ సోషల్ మీడియాలో గాంధీని అవహేళన చేస్తూ సందేశాలను పంపుతూ నేటి యువతకు తప్పుదోవ పట్టిస్తూ గాంధీని అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ మహత్ముడి రూపాన్ని ఎవరూ దేశం నుంచి చేరపలేరని, ఆయన స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటం, చేసిన త్యాగం మరవలేవన్నారు. కార్యక్రమంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, రాష్ట్ర బీసీ అధ్యక్షుడు దాదా గాంధీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి రఘువీరారెడ్డి


