చోరీ కేసుల్లో ముగ్గురు నిందితుల అరెస్ట్
చెన్నేకొత్తపల్లి: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు చోరీ కేసుల్లోని నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, కారు, ఒక కిలో రెండు వందల గ్రాముల వెండిని చెన్నేకొత్తపల్లి పోలీసులు రికవరీ చేశారు. చెన్నేకొత్తపల్లి పోలీస్‌స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ సత్యనారాయణ మాట్లాడారు. చెన్నేకొత్తపల్లిలో ఈనెల 10న రాత్రి రెండిళ్లలో చోరీ జరగడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఈనెల 27న ముగ్గురు మండల పరిధిలోని ఎన్‌ఎస్ సమీపంలో ధర్మవరం వెళ్లేదారిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని సమాచారం వచ్చిందన్నారు. సిబ్బందితో అక్కడికి వెళ్లి మేడాపురానికి చెందిన సాకే శివ, ధర్మవరం మండలం ఎర్రగుంటకు చెందిన గుజ్జల విజయ్, మేడాపురానికి చెందిన సాకే తరుణ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 9 తులాల బంగారు, 2.5 కిలోల వెండి చోరీ చేసినట్లు అంగీకరించారన్నారు. దొంగిలించిన బంగారు, వెండిని అనంతపురము పట్టణంలోని గోల్డ్ ప్రైవేటు కంపెనీలో విక్రయించినట్లు తెలిపారన్నారు. వారి నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, కారు, కిలో రెండు వందల గ్రాముల వెండిని సీజ్ చేశామన్నారు. వీరిపై ఉమ్మడి జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్‌లో కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. బంగారు కొనుగోలు చేసిన ప్రైవేటు కంపెనీ సిబ్బందిపై కూడా కేసు నమోదు చేశామన్నారు.


