రగులుకున్న ‘బొగ్గుల’ కుంపటి
బత్తలపల్లి: పచ్చ పార్టీలో బొగ్గుల కుంపటి రగులుకుంది. మహారాష్ట్ర నుంచి వచ్చి మండలంలో బొగ్గు తయారు చేసి ఎగుమతి చేస్తున్న వ్యాపారులపై టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఇక్కడ వ్యాపారం చేయాలంటే తమకు కప్పం కట్టాల్సిందేనంటూ టీడీపీలోని రెండు వర్గాలు డిమాండ్ చేయడంతో దిక్కుతోచని వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు టీడీపీలోని ఓ వర్గంపై కేసు నమోదు చేయగా... టీడీపీ వారే తమను టార్గెట్ చేశారని నిందితులు ఆరోపిస్తున్నారు.
మహారాష్ట్ర వ్యాపారి ఫిర్యాదుతో కేసు..
మండలంలోని వేల్పుమడుగు గ్రామ వాగు సమీపంలో మహారాష్ట్రకు చెందిన బొగ్గుల మేసీ్త్ర పరశురాం రాథోడ్ కూలీలతో బొగ్గును తయారు చేయిస్తున్నాడు. డిసెంబర్ 31వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో వేల్పుమడుగుకు చెందిన నాగార్జునరెడ్డి, బత్తలపల్లికి చెందిన అప్పస్వామి అలియాస్ జగ్గూ, అతని అనుచరులు నల్లబోయనపల్లికి చెందిన కౌశిక్, ఈదుల ముష్టూరుకు చెందిన సాంబ బొగ్గులు కాల్చే ప్రాంతానికి వెళ్లారు. ‘బొగ్గులు కాల్చుకోవాలంటే మాకు డబ్బులు ఇవ్వాలి.. లేదంటే ఇక్కడున్న బొగ్గులను కూడా తీసుకుని పోలేవు’’ అని బెదిరించడంతో పాటు అతన్ని తీసుకువెళ్లి అప్పస్వామి ఇంట్లో నిర్బంధించి రాత్రి 12.10 గంటలకు పంపించారు. దీంతో బొగ్గుల తయారీదారుడు సహబ్రోలు పరశురాం గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్‌ఐ సోమశేఖర్ నలుగురు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. శుక్రవారం వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
వాటాల్లో తేడాలతోనే కేసు..
బత్తలపల్లి మండలంలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. బొగ్గు, ఇసుక, మట్టి..ఇలా ఏది తరలించాలన్నా టీడీపీ నేతలకు కప్పం కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే టీడీపీలో రెండు వర్గాలు ఉండటంతో ఓ వర్గానికి డబ్బులిస్తే... మరోవర్గం వచ్చి బెదిరింపులకు దిగుతోంది. ఈక్రమంలోనే బొగ్గుల వ్యాపారికి బెదిరింపులు, కిడ్నాప్ తతంగం నడిచిందని టీడీపీ నాయకులే ఆరోపిస్తున్నారు. ఈ వాదనలకు బలం చేకూరుస్తూ తాజాగా అరెస్టయిన టీడీపీ నేతలు కూడా సొంత పార్టీ నేతలే కుట్ర చేసి తమను కేసులో ఇరికించారని ఆరోపించారు.
కమీషన్ కోసం బొగ్గుల తయారీదారునిపై టీడీపీ నేతల దౌర్జన్యం
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు.. పచ్చ నేతల అరెస్ట్, రిమాండ్
టీడీపీలోని మరోవర్గమే తమపై కుట్ర చేసిందంటున్న నిందితులు
పోలీసులే ఇసుక, బొగ్గు వ్యాపారులతో డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపణలు
పోలీసులపై నిందితుల ఆరోపణలు..
బొగ్గుల వ్యాపారుల నుంచి కమీషన్ తీసుకునే విషయంలోనే కొన్నిరోజుల క్రితం మండలంలోని నల్లబోయనపల్లి సమీపంలో టీడీపీలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కేసు విచారణ సమయంలో న్యాయమూర్తి తమతో మాట్లాడగా.. పోలీసులు కొట్టి బలవంతంగా కేసు ఒప్పించారని చెప్పామని, దీన్ని మనసులో పెట్టుకుని పోలీసులు తమపై తప్పుడు కేసులు పెట్టారని నిందితులు ఆరోపిస్తున్నారు. పోలీసులే ఇసుక, బొగ్గులు తరలింపులో డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఏదిఏమైనా అధికార పార్టీ నేతలు కమీషన్ల కోసం ఇలా ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకుంటూ రచ్చకెక్కడం జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేతల దౌర్జన్యాలకు బొగ్గుల వ్యాపారి కిడ్నాప్ ఘటన అద్దం పట్టింది.


