31,368 మంది రైతులకు పాసుపుస్తకాలు
సోమందేపల్లి: రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని 31,368 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేసినట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలోని నాగినాయని చెరువు గ్రామంలో మంత్రి సవితతో కలిసి రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో రీసర్వే పూర్తయిన 330 గ్రామాల్లో సభలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ నెల 9వ తేదీ వరకూ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. భూ సమస్యల పరిష్కారానికి గ్రామస్థాయిలో వీఆర్‌ఓలు అందుబాటులో ఉంటారన్నారు. రెవెన్యూ క్లినిక్ ద్వారా సమస్యలన్నీ సకాలంలో పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో నగర కార్పొరేషన్ చైర్మన్ వెంకట రమణ, ఇన్‌చార్జ్ తహసీల్దార్ మారుతి తదితరులు పాల్గొన్నారు.
నేడు జెడ్పీ
సర్వసభ్య సమావేశం
అనంతపురం టవర్‌క్లాక్: ఉమ్మడి అనంతపురం జిల్లా జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 10.30 గంటలకు జెడ్పీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు సీఈఓ శివశంకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జెడ్పీటీసీ సభ్యులు, అధికారులు తప్పకుండా హాజరు కావాలని కోరారు. దాదాపు 36 శాఖల ప్రగతి నివేదికలను సంబంధిత అధికారులు తీసుకురావాలన్నారు.
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించాలి
● అధికారులతో కలెక్టర్ శ్యాం ప్రసాద్
ప్రశాంతి నిలయం: సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా చూడాలని, పథకాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేస్తూ ప్రజల సంతృప్తి స్థాయి పెంచాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ జిల్లా అధికారులకు ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, ప్రజా సానుకూల అవగాహన, రైల్వే లెవెల్ క్రాసింగ్స్ తదితర అంశాలపై చర్చించారు. కలెక్టరేట్‌లోని వీసీ హాలు నుంచి కలెక్టర్ శ్యాం ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడారు. జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు జరిగే పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. వైద్య సేవలు, ఆలయాల నిర్వహణ, పారిశుధ్యం నిర్వహణపై అధిక శ్రద్ధ చూపాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సరిహద్దులపై అపోహలొద్దు
● రీసర్వే పక్కాగా చేశామన్న
జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
ముదిగుబ్బ: రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సరిహద్దులు, ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్‌పీఎం) పక్కాగా రూపొందించామని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అన్నారు. జాయింట్ ఎల్‌పీఎంలపై అపోహ వీడాలని రైతులకు సూచించారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని మర్తాడులో జరిగిన గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. అనంతరం ముదిగుబ్బ తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఆ సమయంలో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి అందుతున్న సేవలను తెలుసుకున్నారు. జేసీ వెంట ఆర్డీఓ మహేష్, తహసీల్దార్ నారాయణస్వామి ఉన్నారు.
31,368 మంది రైతులకు పాసుపుస్తకాలు
31,368 మంది రైతులకు పాసుపుస్తకాలు


