నలుగురు గంజాయి విక్రేతలకు రిమాండ్
కదిరి టౌన్: గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడంతో పాటు గంజాయి సేవించిన 10 మందిపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి శుక్రవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
పక్కా సమాచారంతో దాడి..
పట్టణంలోని కోనేరుకు సమీపంలోని ఏటిగడ్డ వద్ద ఉన్న సమాధుల వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు శుక్రవారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఐ నారాయణ రెడ్డి తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి గంజాయి విక్రయిస్తున్న బుక్కే ఆంజనేయులు నాయక్, దేవరకొండ పవన్‌కుమార్, సాకే సూరి, చాకలి ఆదినారాయణను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.20 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే సమీపంలోనే గంజాయి సేవిస్తూ దొరికిన శివాలయం వీధికి చెందిన వంశీ, రాజు, నవదీప్(డాన్)లోకేష్, మగ్గాల క్వార్వర్స్‌కు చెందిన దేవా, సోము, నల్లగుట్టవీధికి చెందిన మౌళి, సంగం హాల్ సమీపంలో నివాసం ఉంటున్న వడల బండి షబ్బీర్, నాగిరెడ్డిపల్లి ఏరియాకు చెందిన సౌకత్ తదితర పది మందిని కూడా అరెస్టు చేశారు. అనంతరం గంజాయి విక్రేతలు నలుగురిని పట్టణంలో నడిపించుకుంటూ స్టేషన్ వరకూ తీసుకువెళ్లారు. అనంతరం వారిని కదిరి ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా న్యాయమూర్తి లోకనాథం వారికి రిమాండ్‌కు పంపారు. ఇక గంజాయి సేవిస్తూ దొరికిన వారిపై కేసు నమోదు చేసిన సీఐ నారాయణరెడ్డి కౌన్సెలింగ్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అలాగే గతంలో గంజాయి కేసులున్న 15 మందిని స్టేషన్‌కు పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇక నుంచి మీపై నిరంతరం నిఘా ఉంచుతామని, ఎవరైనా గంజాయి సేవించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు డీఎస్పీ శివనారాయణస్వామి విలేకరులకు తెలిపారు. గంజాయి విక్రయాలు, వినియోగాన్ని ఇక సహించబోమన్నారు. సమావేశంలో పట్టణ సీఐ నారాయణరెడ్డి, పలువురు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
1.20 కేజీల గంజాయి స్వాధీనం
గంజాయి సేవించిన
మరో 10 మందిపై కేసు
విలేకరుల సమావేశంలో
డీఎస్పీ శివనారాయణ స్వామి


