మట్టి కొల్లగొట్టింది నిజమే
సోమందేపల్లి: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంపద సృష్టికి టీడీపీ నేతలు గేట్లు ఎత్తేశారు. రూ. లక్షలు విలువ చేసే సహజ వనరులను కొల్లగొట్టారు. సకాలంలో స్పందించి అక్రమ దోపిడీని అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడంతో మాఫియాను తలదన్నేలా ఇసుక, మట్టి అక్రమ రవాణాలు యథేచ్ఛగా కొనసాగాయి. ఈ దోపిడీపై చివరకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉష శ్రీచరణ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, రైతులు ఉద్యమించడంతో అధికారుల్లో చలనం వచ్చింది.
రూపురేఖలు కోల్పోయిన చెరువు..
టీడీపీ నాయకుల మట్టి తవ్వకాలతో సోమందేపల్లి మండలం మాగేచెరువు పంచాయతీలోని కొత్తపల్లి గ్రామ చెరువు రూపురేఖలు మారిపోయాయి. సమీపంలోని రంగేపల్లి రైల్వేస్టేషన్ వద్ద ట్రాక్ ఇతర పనులకు మట్టి తరలిస్తున్నామంటూ స్థానిక టీడీపీ నేతలు సాగించిన అక్రమ దందా కారణంగా చెరువుతో పాటు సమీపంలోని శ్మశాన వాటిక ఉనికి కోల్పోయింది. మంత్రి సవిత అండతో సాగుతున్న ఈ అక్రమాన్ని అధికారులు నిలువరించలేకపోయారు. చెరువు మట్టిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించి రూ.లక్షల్లో సొమ్ము చేసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. మట్టి తవ్వకాలపై గతంలో ప్రశ్నించిన సీపీఐ నేతలతో పాటు పాత్రికేయులపై కూడా మంత్రి సవిత అనుచరులు దాడులకు తెగబడ్డారు. ఈ దౌర్జన్యాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ అక్రమాన్ని కొత్తపల్లి గ్రామస్తులు, రైతులు వ్యతిరేకరించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉష శ్రీచరణ్ ఆధ్వర్యంలో గత సోమవారం చెరువు వద్ద ధర్నా చేపట్టి మట్టి అక్రమ తరలింపులను నిలువరించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం అదే రోజు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిప్యూటీ తహసీల్దార్ రెడ్డి శేఖర్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం గనుల శాఖ ఇన్‌స్పెక్టర్ అమీర్‌బాషా, నీటిపారుదల శాఖ అధికారులు కొత్తపల్లి గ్రామ చెరువును పరిశీలించారు. నెలన్నర క్రితం మట్టి తవ్వకాలు జరిగాయని నిర్ధారించారు. అయితే బాధ్యులపై ఎలాంటి చర్యలు చేపడతామనే అంశంపై స్పష్టత ఇవ్వలేకపోవడంతో గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ ఆందోళనతో మేల్కొన్న అధికార యంత్రాంగం
కలెక్టర్ ఆదేశాలతో
ఆగమేఘాలపై తనిఖీలు
అక్రమ తరలింపులు
వాస్తవమని నిర్ధారణ
బాధ్యులపై తీసుకునే
చర్యలపై స్పష్టలేమి
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ అధికారులు. రూ. లక్షల విలువ చేసే సహజ వనరులను అడ్డగోలుగా తరలిస్తున్నా.. ఇంత కాలం చూసీచూడనట్లు వ్యవహరించారు. ఈ అక్రమంపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గ్రామస్తులు, రైతులు నిలదీయడంతో అధికారుల్లో చలనం వచ్చింది.


