‘లా నేస్తం’ అమలు చేయాలి
అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా... నేటికీ లా నేస్తం పథకం అమలు చేయకుండా జూనియర్ న్యాయవాదులను ఇబ్బందులకు గురిచేస్తోందని జిల్లా న్యాయవాదులు సంక్షేమ సంఘం అధ్యక్షుడు సి. హనుమన్న విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హనుమన్న మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన లా నేస్తం పథకాన్ని కొనసాగించడంతో పాటు ప్రోత్సాహకాన్ని రెట్టింపు చేస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేష్ స్పష్టమైన హామీనిచ్చారని గుర్తు చేశారు. అధికారం చేపట్టిన తర్వాత ఆ హామీని విస్మరించడం తగదన్నారు. ఇచ్చిన హామీని అమలు చేసి జూనియర్ న్యాయవాదులకు దన్నుగా నిలవాలని కోరారు. వాస్తవానికి లా నేస్తం పథకానికి నయాపైసా నిధులు ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లు కొన్ని పత్రికల్లో కథనాలు రావడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు బాలాజీనాయక్, ప్రధాన కార్యదర్శి ఎం.కృష్ణప్ప, జూనియర్ న్యాయవాదులు ఎం.దిలీప్‌కుమార్, పి.లక్ష్మీనారాయణ, జె.శ్రీకాంత్, కె.బాబయ్య తదితరులు పాల్గొన్నారు.
అందుబాటులోకి ‘సెక్స్ సార్టెడ్ సెమెన్’
పుట్టపర్తి అర్బన్: పాడి పెంపు లక్ష్యంగా ఆవులు, గేదెల్లో పెయ్య దూడలు జన్మించేలా సాంకేతికంగా అభివృద్ధి చేసిన 15 వేల డోసుల సెక్స్ సార్టెడ్ సెమెన్ అందుబాటులో ఉన్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శుభదాస్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పాడి పశువులున్న రైతులకు వీటిని ఉచితంగా అందజేయనున్నారని, వీటి కోసం సమీపంలోని పశు వైద్యశాలల్లో సంప్రదించాలని కోరారు.


