మానవత్వం మరచి
రాప్తాడు రూరల్: నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని బుధవారం రాత్రి అనంతపురం నగర శివారులోని హార్మోన్ సిటీ – కార్బన్ సిటీ ప్రాంగణంలో నిర్వహించిన ‘శుభారంభం–2026’ ఈవెంట్ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. అయినా మృతదేహాన్ని అక్కడే ఉంచుకుని ఈవెంట్‌ను నిర్వాహకులు కొనసాగిస్తుండడంతో బాధిత కుటుంబసభ్యులు ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఏం జరిగిందంటే...
అనంతపురంలోని వేణుగోపాల్‌నగర్‌కు చెందిన షాజహాన్ కుమారుడు షౌకత్ (17) ఇంటర్ చదువుతున్నాడు. పార్ట్‌టైంగా ఎల్‌ఈడీ టెక్నీషియన్‌గా పని చేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. ఈ క్రమంలో హార్మోన్ సిటీలో ఈవెంట్ నిర్వహణలో ఎల్‌ఈడీ లైట్లు, స్క్రీన్లు ఏర్పాటుకు తోటి టెక్నీషియన్లతో కలసి షౌకత్ వెళ్లాడు. ఎల్‌ఈడీలకు విద్యుత్ కనెక్షన్ ఇస్తున్న క్రమంలో హై ఓల్టేజ్ ప్రసరించి షాక్‌కు గురై అపస్మారకంగా పడిపోయాడు. ఆ సమయంలో క్షతగాత్రుడి గురించి పట్టించుకోకుండా ఈవెంట్‌ను నిర్వాహకులు కొనసాగిస్తూ వచ్చారు. సంబరాల్లో ఆటపాటలతో చిందేయసాగారు. చివరకు తోటి టెక్నీషియన్లు షౌకత్‌ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో షౌకత్ మృతిచెందాడు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి చేర్చి ఉంటే ప్రాణాలు దక్కి ఉండేవని, ఆలస్యంగా తీసుకురావడం వల్ల పరిస్థితి విషమించి షౌకత్ మృతి చెందినట్లుగా వైద్యులు తెలపడంతో మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి.
మృతదేహంతో ఆందోళన..
కళ్లెదుట యువకుడు మృతి చెందినా కనీసం పట్టించుకోకుండా నిర్వాహకులు వ్యవహరించిన తీరుపై బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ షౌకత్ మృతదేహంతో ఈవెంట్ వద్ద ఆందోళన చేపట్టారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నా.. నిర్వాహకుల్లో స్పందన కరువైంది. విందు భోజనాలతో సందడిలో నిమగ్నమైపోయారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన బంధువులు బారికేడ్లను కూలదోసి ఈవెంట్ ప్రాంగణంలోకి దూసుకెళ్లారు. వేదికపైకి రాళ్లు రువ్వారు. శాపనార్థాలు పెడుతూ మనిషి ప్రాణానికి విలువ ఇవ్వకుండా డబ్బే ప్రాధాన్యతగా ఈవెంట్ సంబరాల్లో మునిగి తేలుతున్న నిర్వాహకులపై మండిపడ్డారు. భారీగా నిర్వహిస్తున్న ఈవెంట్ వద్ద కనీసం అంబులెన్స్ కాని, ఫైరింజన్ కాని అందుబాటులో పెట్టలేదని, పది నిముషాల ముందు ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే తమ కుమారుడు బతికేవాడని తల్లిదండ్రులు బోరున విలపించారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో ఈవెంట్‌ను నిర్వాహకులు కాసేపు ఆపేసి, పోలీసుల సాయం కోరారు. సమాచారంఅందుకున్న అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు, పలువురు సీఐలు, సిబ్బంది అక్కడకు చేరుకుని ఆందోళన కారులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఆందోళనకారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు. అప్పటికీ ఆందోళనకారులు శాంతించకపోవడంతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఈవెంట్‌ను యథావిధిగా నిర్వాహకులు కొనసాగించారు.
కొత్త సంవత్సరం వేడుకల్లో అపశ్రుతి
ఏర్పాట్లలో ఎల్‌ఈడీ
టెక్నీషియన్‌కు విద్యుత్ షాక్
పట్టించుకోకుండా సంబరాల్లో చిందేసిన నిర్వాహకులు
ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకెళ్లిన సాటి కార్మికులు
పరిస్థితి విషమించి
మృతి చెందిన యువకుడు
మానవత్వం మరచి
మానవత్వం మరచి
మానవత్వం మరచి


