బేకరీల్లో తనిఖీలు
ధర్మవరం: పట్టణంలోని పలు బేకరీల్లో బుధవారం సాయంత్రం లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ శివశంకర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిర్దేశిత ప్రమాణం కన్నా తక్కువ తూకంతో కేక్‌ల తయారు చేసి విక్రయానికి సిద్ధంగా ఉంచిన విషయాన్ని గుర్తించి పలు బేకరీల నిర్వాహకులకు జరిమానాలు విధించారు. వినియోగదారులను మోసగించడం సరికాదని హెచ్చరించారు.
మృతుడి ఆచూకీ లభ్యం
ధర్మవరం: స్థానిక చెరువులో మంగళవారం లభ్యమైన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆచూకీ తెలిసిందని వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. వివరాలను బుధవారం ఆయన వెల్లడించారు. సాయినగర్‌కు చెందిన మేదర మనోహర్(60) కులవృత్తితో జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం భార్య మృతి చెందింది. ఈ క్రమంలోనే అనారోగ్యం బారిన పడ్డాడు. చికిత్స కోసం వెళితే వైద్యలు పరీక్షించి టీబీగా నిర్ధారించి మందులు అందించారు. వీటిని వాడుతుంటే కడుపులో మంట వస్తోందని తరచూ బాధపడేవాడు. అనారోగ్యంతో పాటు భార్య లేదన్న మనోవేదనతో శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన మంగళవారం చెరువులో శవమై తేలాడు. మృతుడి కుమారుడు అజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
యువకుడి ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని దుర్గానగర్‌కు చెందిన నరసింహులు (35)కు ఇంకా పెళ్లి కాలేదు. టైల్స్ పని చేసేవాడు. ఈ క్రమంలో కేతిరెడ్డి కాలనీలోని ఎల్–4లో నివాసముంటున్న ఓ మహిళతో సహజీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం నరసింహులును వీడి ఆమె వెళ్లిపోయింది. దీంతో క్షణికావేశానికి లోనైన నరసింహులు బుదవారం ఆమె ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రెండో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపారు.
విద్యుదాఘాతంతో
యువకుడి మృతి
రొళ్ల: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు...రొళ్ల మండలం అలుపనపల్లికి చెందిన గంగమ్మ, చిన్నప్పరెడ్డి దంపతులకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కాగా, నాల్గో కుమారుడు శిరీష్‌రెడ్డి (30) కూలి పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. బుధవారం ఉదయం కూలి పనికని గిరేనాయకనపాళ్యం గ్రామానికి వెళ్లాడు. సాయంత్రం పని ముగిసిన తర్వాత రాత్రి 7.30 గంటల సమయంలో ఓ రైతు పొలం వద్ద ట్రాన్స్‌ఫార్మర్ నుంచి లైట్లు వెలిగించేందుకు వైర్లకు కనెక్షన్ ఇస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అక్కడకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఎం.గౌతమి, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించి, మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఎంటెక్, ఎంఫార్మసీ
ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో నిర్వహించిన లాస్ట్ ఛాన్స్ (ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంసీఏ, ఎంబీఏ, బీటెక్, బీఫార్మసీ ) ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద్ నాయుడు బుధవారం విడుదల చేశారు. ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. కార్యక్రమంలో సీఈ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ జి. శంకర్ శేఖర్ రాజు, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ఎం.అంకారావు తదితరులు పాల్గొన్నారు.
బేకరీల్లో తనిఖీలు
బేకరీల్లో తనిఖీలు
బేకరీల్లో తనిఖీలు


