ప్రేమ తిరస్కారం... యువకుడి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

ప్రేమ తిరస్కారం... యువకుడి బలవన్మరణం

Aug 30 2025 8:56 AM | Updated on Aug 30 2025 11:31 AM

కూడేరు: తన ప్రేమను యువతి నిరాకరించడంతో క్షణికావేశానికి లోనై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం గుంతపల్లికి చెందిన నారాయణ కుమారుడు అనిల్‌కుమార్‌ (28) కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆమె అంగీకరించకపోవడంతో క్షణికావేశానికి లోనైన అనిల్‌కుమార్‌.. సెల్ఫీ వీడియో తీసి ఇన్‌స్ట్రాగామ్‌లో అప్‌లోడ్‌ చేసి శుక్రవారం కూడేరు మండలం గొటుకూరు సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ వెంచర్‌లో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై సీఐ రాజు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

అక్రిడిటేషన్ల గడువు పొడిగింపు

ప్రశాంతి నిలయం: జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ కార్డుల గడువును ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా ఉత్తర్వులు మేరకు పీఆర్వో వేణుగోపాలరెడ్డి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత గడువు ఈ నెల 30తో ముగియనుంది. సెప్టెంబరు 1 నుంచి నవంబరు 30వ తేదీ వరకు, లేదా కొత్త కార్డులు జారీ చేయడంలో ఏదీ ముందు జరిగితే అప్పటి వరకు పొడిగింపు ఉంటుంది. సోమవారం నుంచి బస్సు పాసులు రెన్యూవల్‌ చేయించుకోవచ్చు.

‘దుర్గం’లో దొంగ నోట్ల హల్‌చల్‌

కళ్యాణదుర్గం రూరల్‌: పట్టణంలో దొంగనోట్ల చెలామణి వెలుగు చూసింది. బ్రహ్మయ్య గుడి వద్ద ఉన్న ఓ టీ కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం కళ్లజోడు ధరించిన వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు నటిస్తూ రూ.200 నోటును నిర్వాహకురాలు యశోదమ్మ ఇచ్చాడు. రెండు సిగరెట్లు తీసుకోని చిల్లర రూ.160 తీసుకుని వెళ్లిపోయాడు. అయితే అది దొంగ నోటుగా ఆలస్యంగా గుర్తించిన నిర్వాహకురాలి సమాచారంతో విషయాన్ని కొందరు యువకులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీ!

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: తాడిపత్రి మండల తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి మాన్యువల్‌గా జారీ చేసిన ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ శుక్రవారం కలకలం రేపింది. ఈ సంతకం కొంతకాలం క్రితం బదిలీపై వచ్చిన తహసీల్దార్‌ది కావడం గమనార్హం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తాడిపత్రికి చెందిన ఓ యువతి గ్రూప్‌ –2 పరీక్షలకు సిద్ధమవుతూ అర్హత లేకున్నా ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌తో లబ్ధి పొందేందుకు ప్రయత్నించింది. ఈ అంశంలో తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి మాన్యువల్‌గా సర్టిఫికెట్‌ జారీ చేశారు. వెరిఫికేషన్‌లో భాగంగా సర్టిఫికెట్‌ను స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) పంపింది. తన సంతకంతో కూడిన మాన్యువల్‌ సర్టిఫికెట్‌ చూడగానే తహసీల్దార్‌ సోమశేఖర్‌ నివ్వెరపోయారు. సంతకం చేసిన అధికారి గురించి అరా తీసి మందలించే ప్రయత్నం చేయడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తహసీల్దార్‌ తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై సమగ్ర విచారణకు కలెక్టర్‌ ఆదేశించినల్లు తెలిసింది. దీంతో డిఫెన్స్‌లో పడిన సదరు అధికారి అధికార పార్టీ నేతల వద్దకు చేరుకుని పైరవీలకు తెరలేపినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement