
‘ఎంజీఎం’కు క్రీడా ప్రతిభా అవార్డు
హిందూపురం టౌన్: పట్టణంలోని మహాత్మా గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల (ఎంజీఎం)కు జిల్లా స్థాయి క్రీడా ప్రతిభా పాఠశాల అవార్డు దక్కింది. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన జాతీయ క్రీడా దినోత్సవంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ చేతుల మీదుగా అవార్డును పాఠశాల హెచ్‌ఎం పాండురంగనాయకులు, పీడీ లోక్‌నాథ్ అందుకున్నారు. కార్యక్రమంలో ఎంజీఎం పాఠశాల స్కూల్ అసిస్టెంట్ సుదర్శన్‌రెడ్డి, పీడీలు విలియమ్స్, రాణి, ప్రవీణ పాల్గొన్నారు.
కియా ఉద్యోగి అదృశ్యం
పెనుకొండ రూరల్: కియా అనుబంధ పరిశ్రమలో పనిచేస్తున్న యువకుడు కనిపించకుండా పోయాడు. ఘటనపై బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు కియా ఎస్‌ఐ రాజేష్ శుక్రవారం తెలిపారు. వివరాలు... అనంతపురం జిల్లా శెట్టూరుకు చెందిన మైలారప్పకుమారుడు గురుప్రసాద్ ఇటీవల కియా అనుబంధ పరిశ్రమలో కార్మికుడిగా చేరాడు. గుట్టూరులో తనకు కేటాయించిన గధిలోనే సెల్‌ఫోన్, ఇతర సామగ్రిని వదిలేసి వెళ్లిపోయాడు. యాజమాన్యం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు శుక్రవారం ఉదయం కియా పీఎస్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మానసిక పరిస్థితి సరిగా లేదని ఫిర్యాదులో గురుప్రసాద్ తండ్రి మైలారప్ప పేర్కొన్నారు.
బాస్కెట్‌బాల్ బాలికల జట్టుకు జేసీ ప్రశంస
ధర్మవరం అర్బన్: క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల తిరుపతి వేదికగా జరిగిన జోనల్ స్థాయి అమరావతి చాంపియన్‌షిప్ బాస్కెట్‌బాల్ పోటీల్లో రన్నరప్‌ను సాధించిన జిల్లా బాలికల జట్టును జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ అభినందించారు. మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్ర క్రీడా ప్రాధికారక సంస్థ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడాభివృద్ధి అధికారి ఉదయ్ భాస్కర్‌తో కలసి బాలికల జట్టును జేసీ అభినందిస్తూ ట్రోఫీని అందజేశారు. అలాగే జట్టు క్రీడాకారులను ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అసోసియేట్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, ధర్మాంబ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మేడాపురం రామిరెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ్‌తుల్లా, కోచ్ సంజయ్ అభినందించారు.

‘ఎంజీఎం’కు క్రీడా ప్రతిభా అవార్డు

‘ఎంజీఎం’కు క్రీడా ప్రతిభా అవార్డు