
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి
● వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త
ఈరలక్కప్ప
మడకశిరరూరల్: పులివెందుల జెడ్పీటీసీ స్థానం ఉప ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప కోరారు. శనివారం కోతులగుట్టలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చౌళూరు మధుమతిరెడ్డి, నాయకులతో కలిసి సమన్వయకర్త మాట్లాడారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ గుండాలు ఓటమి భయంతో రాళ్లు, కట్టెలతో దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దాడులకు పాల్పడిన టీడీపీ గుండాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పులివెందుల ప్రజలు జగనన్న గుండెల్లో ఉన్నారని, వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలింగ్ బూత్‌లు మార్పు చేయడం వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి గెలవాలని ప్రభుత్వం కుట్ర చేయడం అంటే ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేసినట్లేన్నారు. పోలీసులు కూడా శాంతిభద్రతలను కాపాడాల్సింది పోయి అధికార పార్టీ కోసం ఏకపక్షంగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేస్తుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆనందరంగారెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ యాదవ్, మండల కన్వీనర్ రామిరెడ్డి, ఎంపీపీ కవిత, నాయకులు పాల్గొన్నారు.
అప్పు విషయమై
దంపతులపై దాడి
ధర్మవరం అర్బన్: అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి తనకు చెల్లించలేదని పట్టణంలోని వైఎస్సార్‌కాలనీకి చెందిన దాదా ఖలందర్, అర్ఫియాభాను దంపతులపై ఓ వ్యక్తి దాడి చేశాడు. టూటౌన్ సీఐ రెడ్డప్ప తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దాదాఖలందర్ కనగానపల్లి మండలం కుర్లపల్లికి చెందిన ఇనయతుల్లాతో మార్చిలో రూ.10వేలు అప్పు తీసుకున్నాడు. తిరిగి అదే నెలలో ఇనయతుల్లా తల్లి అబీదాకు ఇచ్చేశారు. కానీ అబీదా తన కుమారుడు ఇఇనయతుల్లాకు ఆ విషయం చెప్పలేదు. దీంతో శనివారం వైఎస్సార్‌కాలనీకి వచ్చిన ఇనయతుల్లా డబ్బులు ఇవ్వాలని దాదా ఖలందర్ దంపతులపై దాడి చేసి గాయపరిచాడు. స్థానికులు వెంటనే వారిని కాపాడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం టూ టౌన్ పోలీసుస్టేషన్‌కు వచ్చి దాదాఖలందర్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.