రోగులకు మెరుగైన వైద్య సేవలు | - | Sakshi
Sakshi News home page

రోగులకు మెరుగైన వైద్య సేవలు

May 16 2025 12:43 AM | Updated on May 16 2025 12:43 AM

రోగులకు మెరుగైన వైద్య సేవలు

రోగులకు మెరుగైన వైద్య సేవలు

హిందూపూరం టౌన్‌: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నట్లు డీసీహెచ్‌ఎస్‌ పాల్‌ రవికుమార్‌ తెలిపారు. స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రిని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులు, ఓపీ విభాగం, ఫార్మసీ, డయాలసిస్‌ యూనిట్‌తో పాటు నిర్మాణంలో ఉన్న క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ భవన సముదాయాన్ని పరిశీలించారు. పలు రికార్డులు తనిఖీ చేశారు. శిథిలావస్థకు చేరుకున్న మార్చురీని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలోని సమావేశ మందిరంలో వైద్యులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. వైద్యులకు అవసరమైన పరికరాలు, మెరుగైన వైద్య సేవలు అందించడానికి కావాల్సిన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్‌ యూనిట్‌లో ఏసీలు పనిచేయకపోవడంతో రోగులు పడుతున్న ఇబ్బందులు గమనించి అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల్లో ఏసీలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

5 నెలల్లో అందుబాటులోకి క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌

ఆస్పత్రిలో క్రిటికల్‌ కేర్‌ భవన నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో పలు రకాల వైద్య సేవలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. మరో ఐదు నెలల్లో ఈ నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. తద్వారా మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించవచ్చునన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించినట్లు పేర్కొన్నారు. చిన్నారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్యం అందించడంతో పాటు వార్డుల్లో ఇన్‌పేషంట్‌ సేవలు మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆస్పత్రిలో అందించే ప్రతి చికిత్సను ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద నమోదు చేయాలని వైద్యులను ఆదేశించినట్లు తెలిపారు. వైద్యుల ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేశామన్నారు. అలాగే నెల రోజుల్లోపు ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఫార్మసీలో అన్ని మందులను అందుబాటులోకి తీసుకు వచ్చామని, ముఖ్యంగా గుండె నొప్పితో బాధపడేవారు ఆసుపత్రిలో స్టేమీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆధునిక మార్చురీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ కింద ఆస్పత్రికి అవసరమైన పరికరాలను కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆస్పత్రిలో డీ–అడిక్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, నియామకాలు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లింగన్న, ఎమ్మెల్యే పీఏ వీరయ్య, వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

డీసీహెచ్‌ఎస్‌ పాల్‌ రవికుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement