ఐఐటీ విద్యార్థికి ఆర్థిక కష్టం
నా ప్రతిభ ఉపయోగ పడాలి
నా ప్రతిభ నాకు, నా కుటుంబానికి మాత్రమే కాదు... నా ఊరు..నా రాష్ట్రం..నా దేశానికి ఉపయోగ పడాలి. ఎంతోమంది భారతీయులు విదేశాల్లో చదువుతున్న తమ పిల్లలకు డబ్బు పంపాలంటే రూ.లక్షకు 30 శాతం వరకూ కమిషన్ రూపంలో చెల్లించాల్సి వస్తోంది. వారిపై ఈ భారం తగ్గించాలనేది నా కోరిక. దీనిమీదే పరిశోధనలు చేస్తున్నా. కేవలం 4, 5 శాతం ఖర్చుతోనే విదేశాల్లో ఉన్న మనవాళ్లకు డబ్బు పంపే విధానంపై దృష్టి సారించా. నా ఐఐటీ పూర్తయ్యేలోపే కచ్చితంగా నా కల నెరవేరుతుంది. ఆ దేవుడు కూడా నాకు దాతల రూపంలో సాయం అందేలా చేస్తున్నారు.
– మేఘనాథ్‌రెడ్డి, ఐఐటీ విద్యార్థి
తండ్రి తాగుడుకు బానిసై
కుటుంబాన్ని వదిలేసి ఎటోవెళ్లిపోయాడు. తల్లిరెక్కల కష్టంతో చదువుతున్న యువకుడు ఢిల్లీ ఐఐటీలో గత ఏడాది సీటు
సాధించాడు. అయితే ఆర్థిక ఇబ్బందులు చదువుకు ఆటంకం కల్గిస్తున్నాయి. కనీసం ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేక ఆందోళన చెందుతున్నాడు. దాతలు స్పందిస్తే బాగా చదువుకుని సమాజానికి తనవంతు సాయం చేస్తానంటున్నాడు.
కదిరి: పట్టణంలోని మారుతి నగర్‌లో కాపురం ఉంటున్న వి.జయలక్ష్మి అమడగూరులో ఎఫ్‌ఎన్‌ఓ (ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ)గా ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తోంది. ఆమె భర్త రాజేష్ బాబురెడ్డి మద్యానికి బానిసై ఎటో వెళ్లిపోయాడు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థానంలో చూడాలనేది జయలక్ష్మి ఆశయం. తల్లి ఆశయాలకు తగ్గట్టుగానే పెద్ద కొడుకు మేఘనాథ్‌రెడ్డి గత ఏడాది ఢిల్లీ ఐఐటీలో సీటు సాధించాడు. ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. చిన్నబ్బాయి జయకిషోర్‌రెడ్డి సైతం కదిరి మున్సిపల్ హైస్కూల్‌లో చదివి 10వ తరగతి ఫలితాల్లో 485 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. గత ఏడాది మేఘనాథరెడ్డి ఢిల్లీ ఐఐటీలో సీటు సాధించగా తల్లి జయలక్ష్మి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తన కుమారుడి ఐఐటీ చదువు కలగానే మిగిలిపోతుందని వేదన చెందింది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గొప్ప మనసు
మేఘనాథరెడ్డి ఢిల్లీ ఐఐటీలో చదవాలంటే ఏడాదికి రూ.7 లక్షలు దాకా ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి. అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియక జయలక్ష్మి కుమిలిపోయింది. వీరి పరిస్థితి ఇరుగుపొరుగు ద్వారా ‘రెడ్డి వెల్ఫేర్ సొసైటీ’ సభ్యుల దృష్టికి వెళ్లింది. వారి ద్వారా ఈ కుర్రాడి ఆర్థిక ఇబ్బందులు విన్న తలుపుల మండలం ఉబ్బర వాండ్లపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎం.సుధాకర్‌రెడ్డి మొదటి సంవత్సరం ఫీజు మొత్తం ఒకేసారి రూ.7 లక్షలు ఆ కుటుంబానికి అందజేశాడు. దీంతో గత ఏడాది మేఘనాథరెడ్డి చదువుకు ఎలాంటి ఆటంకం కలగలేదు. ఇప్పుడు మళ్లీ దాతల సాయం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది.
చదువుల్లో ముందంజ
మేఘనాథరెడ్డి చిన్నప్పటి నుండే చదువుల్లో ముందంజలో ఉండేవాడు. 10వ తరగతిలో 98 శాతం, ఇంటర్‌లో 96 శాతం మార్కులు సాధించాడు. జేఈఈ మెయిన్స్‌లో 15 వేలు, అడ్వాన్స్‌లో 18 వేల ర్యాంకు సాధించి ఢిల్లీ ఐఐటీలో ప్రవేశం పొందాడు. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్న మేఘనాథ్‌రెడ్డి విదేశాలకు డబ్బు పంపితే చెల్లించాల్సిన కమిషన్ శాతం తగ్గించడంపై పరిశోధన చేస్తున్నాడు. తప్పకుండా తన పరిశోధన ఫలిస్తుందంటున్నాడు.
ఢిల్లీ ఐఐటీలో సీటు సాధించిన
మేఘనాథరెడ్డి
గత ఏడాది ఫీజు రూ.7 లక్షలు
అందించిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
ఇప్పుడు రెండో సంవత్సరం
ఫీజు కోసం అష్ట కష్టాలు
దాతలు స్పందిస్తే చదువుకునే అవకాశం
దాతలు సంప్రదించాల్సిన వివరాలు
బాలుడి తల్లి పేరు: వి.జయలక్ష్మి
బ్యాంకు అకౌంట్ నంబర్: 110118882266
బ్యాంకు పేరు: కెనరా బ్యాంకు, కదిరి
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్: సీఎన్‌ఆర్‌వీ0006118
ఫోన్ పే నంబర్: 95420 02810
ఐఐటీ విద్యార్థికి ఆర్థిక కష్టం


