అర్జీలు పరిష్కరించకపోతే చర్యలు
ప్రశాంతి నిలయం: ‘‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే ప్రతి అర్జీకి నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ కొన్ని శాఖల అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నెలల తరబడి అర్జీలను పెండింగ్ ఉంచారు. ముఖ్యంగా రెవెన్యూ, సర్వే, పోలీస్ పంచాయతీ రాజ్, ఏపీఎస్పీడీసీఎల్ శాఖల పరిధిలో అత్యధిక గ్రీవెన్స్ అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇకనైనా అధికారులు పద్ధతి మార్చుకుని అర్జీలకు పరిష్కారం చూపాలి. లేకపోతే కఠిన చర్యలు తప్పవు’’ అని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 231 అర్జీలు అందగా, వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అనంతరం కలెక్టర్ చేతన్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి అర్జీకి అర్థవంతమై సమాధానం ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు నెలవారీ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుని నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీల పరిష్కారంపై డీఆర్‌ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇక నుంచి ప్రతి శుక్రవారం జిల్లా ప్రణాళిక అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జిల్లాలోని అన్ని శాఖల హెచ్‌ఓడీలతో వివిధ శాఖలకు సంబంధించిన నెలసరీ ప్రగతి నివేదికలపైన, పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీల పరిష్కారంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తారన్నారు.
● అనంతరం ఆయన కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పరిశీలించారు. ప్రతి సోమవారం చిరుధాన్యాలకు సంబంధించిన స్టాల్స్‌ను నిర్వహించాలని సూచించారు.
దివ్యాంగుడికి హామీ..
ఓడీ చెరువు మండలానికి చెందిన దివ్యాంగుడు శంకర సమస్యను కలెక్టర్ విన్నారు. 63 సెంట్లు భూమికి పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేయాలని కోరగా, త్వరలోనే జాయింట్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్‌ఓ విజయసారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, పశుసంవర్ధక శాఖ జేడీ శుభదాస్, సెరికల్చర్ జేడీ పద్మావతి, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, సీపీఓ విజయ్ కుమార్, ల్యాండ్ సర్వే ఏడీఈ విజయశాంతి బాయి, ఎల్‌డీఎం రమణకుమార్, ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ తిప్పేంద్రనాయక్, గిరిజన సంక్షేమ అధికారి మోహన్‌రావు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫిరోజ్ బేగం, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
కౌమార బాలికల సాధికారతకు
కృషి చేయాలి..
కౌమార బాలికల సాధికారత కోసం కృషి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్ సమావేశం అనంతరం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘కిశోర వికాసం’ వాల్ పోస్టర్లను ఆయన అవిష్కరించారు. కిశోర వికాసం పేరుతో ప్రతి గ్రామం, వార్డులో కిశోర బాలికలకు ప్రతి మంగళవారం, శుక్రవారం 12 అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. మే 2వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకూ సమ్మర్ క్యాంప్ నిర్వహించాలన్నారు.
కొన్ని శాఖల్లో పెండింగ్ అర్జీలు ఎక్కువగా ఉన్నాయి
పనితీరు మార్చుకోకపోతే
కఠినంగా వ్యవహరిస్తాం
అధికారులను హెచ్చరించిన
కలెక్టర్ టీఎస్ చేతన్
అర్జీలు పరిష్కరించకపోతే చర్యలు


