దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి
కదిరి టౌన్: బీమా రంగంలో వీదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా మే 20న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు పి.సతీష్ పిలుపునిచ్చారు. ఎల్‌ఐసీ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సంఘం కడప డివిజన్ ఉపాధ్యక్షుడు సూరిబాబు అధ్యక్షతన శనివారం కదిరి ఎల్‌ఐసీ కార్యాలయంలో జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐఆర్‌డీఏ సంస్థ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుకూలంగా పనిచేస్తూ ఎల్‌ఐసీని బలహీన పరిచే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఉద్యోగుల అందరికీ పెన్షన్, పెన్షన్ అప్డేషన్, స్టాగ్నేషన్, ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.రఘునాథ్‌రెడ్డి, ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యదర్శి ఎస్.శ్రీనివాసులు, నాయకులు అక్బర్ బాషా, నాగరాజు, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


