పెచ్చుమీరిన అక్రమాలు, దౌర్జన్యాలు
పెనుకొండ రూరల్: కూటమి పాలనలో అక్రమాలు, దౌర్జన్యాలు పెచ్చుమీరాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ధ్వజమెత్తారు. బుధవారం పెనుకొండ మండలం శెట్టిపల్లిలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల శెట్టిపల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు క్రిష్ణారెడ్డి భూములకు సంబంధించి అధికారుల సహకారంతో మంత్రి సవిత అనుచరులు ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేశారన్నారు. దీంతో ఆయన హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారన్నారు. అమాయక ప్రజల ఆస్తులను కబ్జా చేసేందుకు పెనుకొండ కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. ఇసుక, డీజిల్ అక్రమంగా సరఫరా చేస్తూ మంత్రి సవిత సోమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులును ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. కదిరిలో మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం కై వసం చేసుకునేందుకు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను బెదిరించి తమవైపు లాక్కోవడం ఎంతవరకు సమంజసమో ఎమ్మెల్యే కందికుంటకు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, వైఎస్సార్‌సీపీ పట్టణ, మండల కన్వీనర్లు, బోయ నరసింహులు, సుధాకర్‌రెడ్డి, సర్పంచ్ శ్యామలాబాయి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు సల్లా సూర్య ప్రకాశ్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సాయిరాం నాయక్, అశ్వత్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కూటమి పాలనపై వైఎస్సార్‌సీపీ
జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజం


