వరాల తల్లికి జ్యోతుల హారతి
రొళ్ల: రత్నగిరిలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి వార్షిక ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం జ్యోతుల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారి మూల విరాట్‌తో పాటు ఉత్సవ విగ్రహానికి భక్తులు కానుక రూపంలో తీసుకొచ్చిన పట్టువస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలతో పాటు వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం వేప, తమలపాకులతో అందంగా అలంకరించారు. సాయంత్రం రత్నగిరి ఎస్సీ కాలనీ వాసులు మేళతాళాలతో జ్యోతులను మోసుకువచ్చి ఆలయం చుట్ట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం అమ్మవారికి సమర్పించి హారతులు ఇచ్చారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
భారీగా తరలివచ్చిన భక్తులు..
కొల్హాపురి మహాలక్ష్మీదేవిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తండోప తండాలుగా తరలివచ్చారు. దీంతో శనివారం దేవాలయ ఆవరణ భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన మహిళలు సమీపాన ఉన్న పాలబావి వద్దకు చేరుకుని గంగ పూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు దాతల సహకారంతో భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నేడు పోతులరాజు పూజ..
మహాలక్ష్మీదేవి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం పోతులరాజు పూజ, పుష్పాలంకరణ మహోత్సవం నిర్వహించనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు తెలిపారు.
వైభవంగా కొల్హాపురి మహాలక్ష్మీదేవి జ్యోతుల ఉత్సవం భారీగా తరలివచ్చిన భక్తజనం
వరాల తల్లికి జ్యోతుల హారతి
వరాల తల్లికి జ్యోతుల హారతి


