వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
ధర్మవరం: వక్ఫ్ సవరణ చట్టంలో ఎన్నో లోపాలున్నాయి. వెంటనే ఆ చట్టాన్ని రద్దుచేయాలి’ అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలన్న డిమాండ్‌తో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా సంయుక్త మజీద్ కమిటీలు, ముస్లింలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారంతో ఆరో రోజుకు చేరాయి. ఈ దీక్షల్లో ఇక్బాల్, అజహర్, సైపుల్లా, చాంద్‌బాషా, షరీఫ్, ఘనీ తదితరులు పాల్గొన్నారు. దీక్షలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మక్బూల్ అహ్మద్ సంఘీభావం తెలిపారు. అంతకు ముందు ర్యాలీగా వచ్చి దీక్షా శిబిరంలో పాల్గొని ప్రసంగించారు.
కూటమి నేతల మోసాన్ని గ్రహించాలి..
వక్ఫ్ సవరణ చట్టంలో అనేక లోపాలున్నాయన్నాయని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తులకు రిజిస్ట్రర్ పత్రాలు చూపి హక్కులు పొందాలని ఉందని, నాలుగేళ్లు అయిదేళ్లు కిందట తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న రికార్డులే ప్రస్తుతం కనిపించడం లేదని అలాంటిది వందల ఏళ్ల నాటి మజీద్‌లు, ఆస్తులకు రిజిస్ట్రర్ పత్రాలు తేవడం అసాధ్యమన్నారు. అలాగే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఉండేందుకు కొత్త చట్టం అనుమతిస్తుండటం ఇబ్బందులకు కారణమవుతోందన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తయినా ఇంకా మతం , కులం పేర్లతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. రూ.8 లక్షల కోట్లకు పైగా ఉన్న వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు సవరణ చట్టం తూట్లు పొడుస్తోందన్నారు. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన సంపూర్ణ మద్దతుతోనే చట్ట సవరణ ఆమోదం జరిగిందన్నారు. రంజాన్‌కు ముందు వక్ఫ్ సవరణకు తాము మద్దతు తెలపబోమని చెప్పిన సీఎం చంద్రబాబు ఏమొహం పెట్టుకుని మద్దతిచ్చారో చెప్పాలన్నారు. ఇప్పటికై నా ముస్లింలు కూటమి పార్టీల మోసాన్ని గ్రహించాలన్నారు. అవసరాలకు వాడుకోవడంలో చంద్రబాబుకు మించిన మోసగాడు మరొకరు లేరన్నారు. వక్ఫ్ సవరణ చట్టంతో ముస్లింలకు జరిగే అన్యాయాన్ని గ్రహించే వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బిల్లుకు మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అలాగే సుప్రీంకోర్టులో చట్ట సవరణ రద్దు కోసం పోరాడుతున్నారన్నారు.
ఆమరణ దీక్షకూ వెనుకాడబోం..
వక్ఫ్ సవరణ చట్టంతో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ చట్టాన్ని రద్దు చేసే వరకూ పోరాటం ఉధృతం చేస్తాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు వెనుకాబోం అని వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ కేంద్రాన్ని హెచ్చరించారు. వక్ఫ్ సవరణ విషయంలో ముస్లింలకు అండగా ఉన్న వైఎస్ జగన్‌కు ముస్లిం సమాజం మొత్తం అండగా ఉంటుందన్నారు. వక్ఫ్ సవరణ విషయంలో కూటమి పార్టీలు మద్దతు తెలపడంతో రానున్న రోజుల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. ఇప్పటికై న బుద్ధి తెచ్చుకుని వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లిం సోదరుల పోరాటానికి కూటమి పార్టీలు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌తో కదిరిలో భారీ ర్యాలీ చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మైనార్టీ నాయకులు షేక్ చాంద్‌బాషా, జాకీర్‌హుసేన్, సుభాన్, ఎస్పీ బాషా, అత్తార్ జిలాన్, ఇనాయతుల్లా, సాధిక్ వలి, ఉస్మాన్, నాయకులు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్, పెణుజూరు నాగరాజు, సుబ్బారెడ్డి, కత్తెపెద్దన్న, కడప రంగస్వామి, గడ్డం గంగాధర్, చింతా భాస్కర్‌రెడ్డి, చిగిచెర్ల ప్రభాకర్‌రెడ్డి, దేవరకొండ రమేష్, చెలిమి రామయ్య, నులక రామయ్య, ఏలకుంట్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
కేంద్రం ఆమోదించిన సవరణ చట్టంలో ఎన్నో లోపాలున్నాయి
బిల్లు రద్దు చేయాలని ఆందోళనలు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణం
‘కూటమి’ మద్దతుతోనే
బిల్లు ఆమోదం పొందింది
చంద్రబాబు, పవన్‌లను ముస్లింలు ఎన్నటికీ క్షమించరన్న కేతిరెడ్డి, మక్బూల్
ముస్లింల రిలే నిరాహార దీక్షలకు
సంఘీభావం
వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి


