హిందూపురం టౌన్: అన్ని ఆరోగ్య కార్యక్రమాలు సకాలంలో ప్రజలకు చేరువయ్యేలా బాధ్యతతో విధులు నిర్వర్తించాలని ఆరోగ్య సిబ్బందికి డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజా బేగం సూచించారు. శుక్రవారం హిందూపురంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రి, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లోని రికార్డులు, ల్యాబ్ నిర్వహణ పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్‌సీడీ సర్వే, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డ్స్ పంపిణీ, ఆరోగ్యశ్రీ వైద్య సేవలపై ఆరా తీశారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
యువకుడి ఆత్మహత్య
డి.హీరేహాళ్ (రాయదుర్గం): డి.హీరేహాళ్ మండలంలోని లింగమనహళ్లి గ్రామానికి చెందిన బసవరాజు (24) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న బసవరాజుకు తల్లి భాగ్యమ్మతో పాటు ఓ సోదరుడు, సోదరి ఉన్నారు. అవసరాల నిమిత్తం రూ.20 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చేందుకు భూమి విక్రయిద్దామనుకుంటే అది కాస్త కోర్టు పరిధిలో ఉంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి జీవితంపై విరక్తితో శుక్రవారం పొలం వద్ద క్రిమి సంహారక మందు తాగాడు. గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే బళ్లారిలోని విమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే మృతి చెందాడు. మృతుడి తల్లి కురుబ భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పండ్ల వ్యాపారి దుర్మరణం
పావగడ: స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొమ్మతమరి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ప్రమాదంలో పండ్ల వ్యాపారి ఖాసీం సాహెబ్( 60) దుర్మరణం పాలయ్యాడు. సీఐ సురేష్ తెలిపిన మేరకు... వెంకటాపురం గ్రామానికి చెందిన ఖాసీం సాహెబ్ పెనుకొండలో పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం వేకువజామున తన టీవీఎస్ వాహనంపై బయలుదేరిన ఆయనను తెల్లవారుజాము 5 గంటలకు దొమ్మతమర్రి శివారులోకి చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఘటనలో ఖాసీం సాహెబ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో పాటు ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
బాధ్యతతో విధులు నిర్వర్తించాలి : డీఎంహెచ్‌ఓ