● రైలు వేళల్లో మార్పులతో అవస్థలు
సాక్షి, పుట్టపర్తి యశవంతపుర – మచిలీపట్నం మధ్య నడిచే కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైలు వేళల్లో మార్పుల కారణంగా ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పెనుకొండ నుంచి ధర్మవరం చేరేందుకు మధ్యలో పుట్టపర్తిలో మాత్రమే స్టాప్ ఉంటుంది. ఆ స్టేషన్ల మధ్య ప్రయాణం గంట కూడా పట్టదు. అయితే వేళల్లో మార్పులతో కొండవీడు ఎక్స్‌ప్రెస్ పెనుకొండ నుంచి ధర్మవరం చేరాలంటే మూడున్నర గంటలు పడుతోంది. కాగా ఆ సమయంలో రైలు బండి ఎక్కడ హాల్ట్ చేస్తారనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఒకరోజు పెనుకొండలో.. మరోసారి పుట్టపర్తిలో.. ఇంకోసారి బసంపల్లిలో గంటల తరబడి హాల్ట్ చేస్తున్నారు. దీంతో రైలు ఎక్కిన వాళ్లు.. ఇబ్బందులు పడినా.. ఎక్కాల్సిన వారు తికమక పడుతున్నారు. స్టేషన్‌కు ఎంతసేపటికి వస్తుందో.. అర్థం కాక ముందే వచ్చి.. వేచి చూసి విసిగి చెంది వెనక్కి వెళ్లి.. ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తున్నారు.
మూడు రోజులూ.. ముచ్చెమటలు
వారంలో మూడు (మంగళ, గురు, శనివారం) రోజుల పాటు యశవంతపుర – మచిలీపట్నం మధ్య నడిచే కొండవీడు ఎక్స్‌ప్రెస్ (17212) రైలు రెండు గంటల ముందే నడుస్తోంది. అయితే యశవంతపుర నుంచి ధర్మవరం వరకు మాత్రమే టైమింగ్ మారింది. ధర్మవరం నుంచి మచిలీపట్నం వరకు పాత టైం ప్రకారమే నడుస్తోంది. దీంతో యశవంతపురం నుంచి యలహంక, హిందూపురం, పెనుకొండ వరకు ఇబ్బంది లేదు. ఆ తర్వాత నారాయణపురం, పుట్టపర్తి, బసంపల్లి వరకు రోజుకో చోట.. గంటల తరబడి హాల్ట్ చేస్తున్నారు. దీంతో పుట్టపర్తిలో ఎక్కాల్సిన వారు అవస్థలు పడుతున్నారు.
చాలా ఇబ్బంది పడ్డాను
కొండవీడు రైలు ఇంతకుముందు సరైన సమయానికే నడిచేది. ఉన్నఫలంగా టైమింగ్ మార్చారు. దీంతో రెండు రోజుల క్రితం పుట్టపర్తిలో గంటన్నర సేపు వేచి ఉండాల్సి వచ్చింది. ఆన్‌లైన్‌లో చూస్తే పెనుకొండకు మూడు గంటలకే చేరింది. వెంటనే 3.20 గంటలకు పుట్టపర్తి రైల్వే స్టేషన్ చేరుకున్నా. అయితే రైలు మాత్రం 4.50 గంటలకు వచ్చింది.
– బాబయ్య, ఉపాధ్యాయుడు