
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు
కదిరి టౌన్: ద్విచక్ర వాహనాల దొంగను అరెస్ట్ చేసి రూ.15 లక్షల విలువ చేసే 30 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కదిరి సీఐ పుల్లయ్య తెలిపారు. వివరాలను గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. గత రెండు నెలలుగా కదిరి పట్టణంలో వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలు జరిగాయి. వీటిపై కేసు నమోదు చేసిన పోలీసులు కదిరి డీఎస్పీ శ్రీలత నేతృత్వంలో సీఐ పుల్లయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా విడిపోయి దర్యాప్తు వేగవంతం చేశారు. గురువారం కదిరి – రాయచోటి మార్గంలో వాహన తనిఖీలు చేపట్టిన సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం తూముకుంట గ్రామానికి చెందిన మామిళ్ల వీరారెడ్డిని ఆపి రికార్డుల కోసం ఆరా తీశారు. ఆ సమయంలో ఆయన తడబడడంతో అనుమానం వచ్చి అదుపులోకి తమదైన శైలిలో విచారణ చేయడంతో ద్విచక్ర వాహనాల చోరీల అంశం వెలుగులోకి వచ్చింది. వ్యసనాలకు బానిసగా మారాడు. తన జల్సాలు తీర్చుకునేందుకు అవసరమైన డబ్బు కోసం ద్విచక్ర వాహనాలు అపహరించుకెళ్లి తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కదిరి టౌన్, కదిరి రూరల్, గాండ్లపెంట, అనంతపురం, తాడిపత్రి, రాయచోటిలో 19 కేసులు ఉన్నట్లుగా గుర్తించారు. గాండ్లపెంటలో 2, రాయచోటి 2, కదిరిలో 26 వాహనాలు అపహరించినట్లుగా విచారణలో తేలింది. నిందితుడి అరెస్ట్‌లో చొరవ చూపిన సిబ్బందిని ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీలత అభినందించారు.
రూ.15 లక్షల విలువ చేసే
30 వాహనాలు స్వాధీనం
పట్టుబడిన అన్నమయ్య జిల్లా వాసి
ఉమ్మడి అనంత, వైఎస్సార్ జిల్లాలో పలు కేసులు
