ఆలయంలో చోరీ జరిగిన హుండీని పరిశీలిస్తున్న ద్విసభ్య కమిటీ సభ్యులు
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఇటీవల చోటు చేసుకున్న హుండీలో నగదు అపహరణ ఘటనపై దేవదాయశాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ విజయ్‌సాగర్‌బాబు, కర్నూలు డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ శనివారం విచారణ చేపట్టారు. ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కృష్ణారెడ్డి ఈ నెల 17న హుండీ నుంచి నగదు చోరీ చేస్తూ నిఘా కెమెరాలకు పట్టుబడిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనపై ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఆలయ అధికారుల నివేదిక మేరకు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ద్విసభ్య కమిటీ ఉన్నత స్థాయి విచారణ చేపట్టింది. చోరీ జరిగిన హుండీని, సీసీ ఫుటేజీలను ద్విసభ్య కమిటీ సభ్యులు పరిశీలించారు. తర్వాత గంగా నిలయం సమీపంలోని అతిథి గృహంలో ఆలయ ఈఓ డి.వెంకటేశ్వరరెడ్డి, ఏఈఓ ధనుంజయ, ఇతర సిబ్బందిని విచారించారు. సాయంత్రం మరోసారి ఆలయ ఈఓ కార్యాలయంలోనూ విచారణ కొనసాగించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. హుండీలో నగదు అపహరణ ఘటనపై జరిపిన విచారణకు సంబంధించి నివేదిక సిద్ధం చేసి దేవదాయ శాఖ కమిషనర్‌కు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.


