సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి టీడీపీలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పవర్ గేమ్ ముగిసిందా? అంటే అవునని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కావలి నియోజకవర్గంలో కావలి మున్సిపాలిటీ, అల్లూరు నగర పంచాయతీ ఎన్నికల బాధ్యతలను టీడీపీ అధిష్టానం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మంత్రి నారాయణలకు అప్పగించడం, అదే సమయంలో బీద బ్రద ర్స్ తమ సొంత గడ్డ అల్లూరులో జరిగిన ఎన్నికల్లో ఎక్కడా వీరి జోక్యం కనిపించకపోవడంపై అనేక రాజకీయ విశ్లేషణలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇటు కావ్య, అటు బీద బ్రదర్స్ మధ్య పొసగని పరిస్థితుల ఉండడం, వర్గ రాజకీయాలు చేస్తుండడంతో ఈ పరిణామాలు ఎన్నికల ఫలితాలపై పడే అవకాశం ఉండడంతో పూర్తిగా బీద బ్రదర్స్ ఎన్నికలకు దూరంగా ఉంచగా, ఎమ్మెల్యే కావ్య మాత్రం కావలిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రచార కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక బీద బ్రదర్స్ ఎన్నికల వ్యవహారాల్లో పూర్తిగా దూరంగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావులకు కీలక బాధ్యతలు అప్పగించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ.. అధిష్టానం మాత్రం ప్రత్యామ్నాయ నాయకత్వానికి ప్రాధాన్యమివ్వడం రాజకీయ చర్చకు దారితీసింది.
కావలిని తాకిన ‘పవర్ గేమ్’
జిల్లాలో టీడీపీ అంతర్గత రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. నెల్లూరు కేంద్రంగా మొదలైన పవర్ పాలిటిక్స్ ఇప్పుడు కావలి నియోజకవర్గానికి విస్తరించాయి. నెల్లూరు కేంద్రంగా మరో సీనియర్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి పవర్ గేమ్స్‌కు చెక్ పెడుతూ ఆధిపత్యం కోరలు పీకేసిన వీరు.. కావలి నియోజకవర్గంలోని కావ్య, బీద బ్రదర్స్ ఆధిపత్యంపై పైచేయి సాధించే దిశగా తొలి అడుగులు వేశారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర రాజకీయ ప్రాధాన్యత తగ్గుతుందనే భావన ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు మేయర్, డిప్యూటీ మేయర్, జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవుల ఎంపికలో వీరి మనీ పవర్ గేమ్ విజయం సాధించడంతో.. కావలి, అల్లూరు మున్సిపాలిటీల ఎన్నికల బాధ్యతలను ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ భజస్కంధాలపై వేసుకున్నారు.
సొంత గడ్డ అల్లూరుకు బీద బ్రదర్స్ దూరం
బీద బ్రదర్స్‌కు రాజకీయంగా బలమైన అనుబంధం ఉన్న అల్లూరు ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నా.. వారి పాత్ర కనిపించకపోవడం మరింత ఆసక్తికరంగా మారింది. అల్లూరు నగర పంచాయతీ ఎన్నికల బాధ్యతలను మంత్రి నారాయణకు అప్పగించడంతో సొంత ప్రాంతంలోనూ బీద బ్రదర్స్ ప్రాధాన్యత తగ్గిందనే చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పార్టీకి విధేయుడిగా, జిల్లా స్థాయిలో కీలక నాయకుడిగా కొనసాగుతున్నప్పటికీ.. స్థానిక ఎన్నికల విషయంలో అధిష్టానం ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బీద మస్తాన్‌రావు సైతం సొంత నియోజకవర్గ పరిధిలో ఎన్నికల వ్యవహారాలకు దూరంగా ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
టీడీపీలో కావ్య,
బీద బ్రదర్స్ సైడ్ ట్రాకేనా?
కావలి, అల్లూరు పుర ఎన్నికల్లో
వేమిరెడ్డి, నారాయణదే పెత్తనం
సొంత గడ్డ అల్లూరులో ముఖం
చాటేసిన మస్తాన్‌రావు, రవిచంద్ర
జిల్లాలో వేమిరెడ్డి, నారాయణ ద్వయం పవర్ పాలిటిక్స్
కీలక పదవుల నుంచి స్థానిక ఎన్నికల వరకు ఇద్దరి కనుసన్నల్లోనే వ్యవహారాలు
కావ్యకు కళ్లెం.. బీదలకు బ్రేక్?
కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, బీద బ్రదర్స్ మధ్య రాజకీయ సఖ్యత అంతంతమాత్రంగానే ఉందనే ప్రచారం చాలాకాలంగా సాగుతోంది. వర్గ విభేదాలు, ఆధిపత్య పోరు నేపథ్యంలో స్థానిక ఎన్నికల బాధ్యతలను వీరి చేతుల్లో పెట్టకుండా ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణలకు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కావలి మున్సిపాలిటీ ఎన్నికల బాధ్యతలను వేమిరెడ్డికి, అల్లూరు నగర పంచాయతీ ఎన్నికల బాధ్యతలను నారాయణకు అప్పగించడంతో స్థానిక నేతల పాత్ర పరిమితమైందనే చర్చ జరుగుతోంది.
జిల్లాలో కీలక పదవుల ఎంపిక నిర్ణయంలో పలువురు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకు ప్రాధాన్యత తగ్గి.. ఇద్దరు నేతల నిర్ణయాలే కీలకంగా మారుతున్నాయనే ప్రచారం ఉంది. ఒకప్పుడు జిల్లా రాజకీయాలపై నిర్ణయం తీసుకోవాలంటే ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షుడు సహా ముఖ్య నేతలందరితో చర్చించి నిర్ణయించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ సంప్రదాయం కనుమరుగవుతోందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అధిష్టానం సైతం ఆ ఇద్దరి నేతల ప్రతిపాదనలకే ప్రాధాన్యత ఇస్తుండడంతో మిగిలిన నాయకుల్లో అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది.


