పొదలకూరు: కూటమి ప్రభుత్వం కొలువుదీరిన దాదాపు రెండున్నరేళ్లలో పొదలకూరులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. డెవలప్‌మెంట్‌పై మాట్లాడే అర్హత తమ కుటుంబానికే ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పేర్కొన్నారు. పొదలకూరు పంచాయతీలోని శింగయ్యచేను, శ్రీహరికాలనీ, మనుబోలు రోడ్డు, అయ్యప్పనగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారాన్ని శుక్రవారం నిర్వహించిన ఆమె మాట్లాడారు. కాలనీల్లో చిన్నపాటి సమస్యలను సైతం పరిష్కరించలేని పరిస్థితుల్లో కూటమి సర్కార్, స్థానిక నేతలున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో పట్టణానికి సమీపంలో పేదలకు ఇళ్లను మంజూరు చేస్తే, లబ్ధిదారులకు ఇప్పటికీ అప్పగించలేదని చెప్పారు. తన తండ్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనే సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని తెలిపారు. పొదలకూరు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించాలంటే తమ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కోనం చినబ్రహ్మయ్య, వార్డు అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
మౌలిక వసతులను కల్పించాం..
స్థానిక నేతలు, కార్యకర్తల సహకారంతో సిమెంట్ రోడ్లు, డ్రెయిన్లను కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిర్మించారని, మురికికూపాల్లా ఉన్న కాలనీలు ఇప్పుడు సుందరంగా మారాయని తెలిపారు. తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా కండలేరు నుంచి ప్రత్యేక పైప్‌లైన్‌ను నేరుగా నిర్మించి పట్టణ ప్రజల అవసరాలను తీర్చామని గుర్తుచేశారు. పంచాయతీని గెలుచుకుంటే సమస్యలను పరిష్కరించేందుకు అవకాశముంటుందని చెప్పారు.


