మూడో విడతలోనూ అదే బరితెగింపు | - | Sakshi
Sakshi News home page

మూడో విడతలోనూ అదే బరితెగింపు

Nov 28 2026 1:20 AM | Updated on Nov 28 2026 1:20 AM

ఐదు నిమిషాల్లోనే తారుమారు

ఇందుకూరుపేట: పంచాయతీ ఎన్నికల మూడో దశలోనూ అధికార పార్టీ బరితెగింపును కొనసాగించింది. ఆర్వోలు, ఖాకీలను అడ్డుపెట్టుకొని ప్రజాస్యామ్యాన్ని అపహాస్యం చేసింది. బెదిరింపులకు గురిచేస్తూ.. నామినేషన్లను విత్‌డ్రా చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చింది. ఈ ప్రక్రియకు పోలీసులు ప్రత్యక్ష సహకారాన్ని అందించి, టీడీపీ ప్రాపకం కోసం పాకులాడారు. ఇంత జరుగుతున్నా, జిల్లా అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూసింది.

అభ్యర్థుల సంతకాల్లేకుండానే విత్‌డ్రా

మండలంలోని డేవిస్‌పేటలో వికృత చేష్టలకు అధికార పార్టీ పాల్పడింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులుగా బరిలో ఉన్న నలుగురు వార్డు సభ్యులకు తెలియకుండానే వా రి నామినేషన్లను విత్‌డ్రా చేశా రు. ఆపై అధికారులు ఇదే అంశాన్ని ప్రకటించడం విస్మయాన్ని కలిగించింది. దీనిపై కలెక్టర్‌, ఆర్డీఓకు ఫిర్యాదు చేయనున్నామని నాలుగో వార్డులో నామినేషన్‌ వేసిన నెల్లూరు వెంకటరమణయ్య తెలిపారు. డేవిస్‌పేటలో జరిగిన తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నామని, అప్పటికీ న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయించనున్నామని డీఎల్డీఏ చైర్మన్‌ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

బద్దెవోలు అభ్యర్థికి బెదిరింపులు

మనుబోలు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో మండలంలోని బద్దెవోలు సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇండ్ల కృష్ణమ్మను తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలంటూ అధికార పార్టీ నేతలు సాయంత్రం వరకూ ఒత్తిడి చేశారు. అయితే ఆమె భయపడకుండా పోటీలో నిలిచారు. టీడీపీ నేతలు తనను బెదిరించి నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా చేశారని ఐదో వార్డు సభ్యుడిగా పోటీలో ఉన్న పూనమల్లి శివ తెలిపారు. ఏడో వార్డు సభ్యుడు తిన్నెలపూడి విజయ్‌ను ప్రలోభాలకు గురిచేసి విత్‌డ్రా చేయించారు. వాస్తవానికి మధ్యాహ్నం మూడింటికే ఉపసంహరణ గడువు ముగిసినా, విత్‌డ్రాకు సాయంత్రమెలా అనుమతిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ప్రజాస్వామ్యం ఖూనీ

నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. ఇతరులు పోటీలో ఉండకుండా తమ అధికార బలాన్ని టీడీపీ వినియోగించి ఏకగ్రీవాలకు పాల్పడింది. రూరల్‌లో 18 పంచాయతీలకు గానూ 12 ఏకగ్రీవమయ్యాయి. అయితే వీటి వెనుక ఆర్వోలపై సైకిల్‌ పార్టీ నేతల ఒత్తిడే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు విజయం సాధించే పంచాయతీల్లో కనీసం అభ్యర్థి పోటీలో నిలవకుండా నామినేషన్లను తిరస్కరించడంతో పాటు బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు.

అరాచకం

కొమ్మరపూడి, పెనుబర్తి, కాకుపల్లి, గొల్లకందుకూరు, కందమూరు పంచాయతీల్లో పార్టీ అభ్యర్థులు, డమ్మీలు నామినేషన్లను దాఖలు చేశారు. అయితే కొర్రీలు చూపి వీటిని తిరస్కరించారు. కొందరు పోటీలో నిలిస్తే, అంతుచూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొండ్లపూడిలో సీపీఐ మద్దతు అభ్యర్థి నామినేషన్‌ను ఆర్వో తిరస్కరించడంపై ఆ పార్టీ నేతలు ఇప్పటికే ఆర్డీఓ కార్యాలయ ఎదుట నిరసన చేపట్టారు.

విత్‌డ్రా చేసుకోవాలంటూ ఒత్తిళ్లు

కోవూరు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కోవూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు అభ్యర్థులపై పోలీసుల ఒత్తిళ్లు, వేధింపుల పరంపర కొనసాగుతోంది. కొడవలూరు మండలంలోని నార్తురాజుపాళెంలో ఏడో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న దేవరకొండ సంపూర్ణమ్మను తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలంటూ పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. విత్‌డ్రా చేసుకుంటే డబ్బులిస్తామని, లేని పక్షంలో అక్రమంగా కేసులు మోపుతామంటున్నారని ఆమె వాపోయారు. రామన్నపాళెంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న తన వద్దకు ఖాకీలొచ్చి, పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి భయభ్రాంతులకు గురిచేశారని చెప్పారు.

బెదిరింపులు.. ప్రలోభాలు

విత్‌డ్రా చేసుకోవాలని హుకుం

సహకరించిన ఆర్వోలు

ఎన్నికలను అపహాస్యం చేస్తున్న అధికార పార్టీ

కోవూరు: పంచాయతీ ఎన్నికల వేళ కొడవలూరు మండలంలోని నార్తురాజుపాళెంలో పదో వార్డు వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థి వీరి రమణమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తొలుత ప్రకటించారు. అయితే కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే ఎమ్మెల్యే ఆదేశాలతో తారుమారు చేశారు. ఈ వార్డులో గోడ అరుణకుమారి, రొండ్ల తేజస్విని, వీరి రమణమ్మ బరిలో ఉన్నారు. అయితే ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వీరి రమణమ్మ ఏకగ్రీవమయ్యారని ప్రకటించారు. అయితే కొద్దిసేపటికే మాటమార్చి.. అభ్యర్థుల వివరాలు తెలియక పొరపాటున ఏకగ్రీవమని చెప్పామనడం వివాదాస్పదమైంది. ఆర్వోగా ఉన్న కావలి మండలం ముసునూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జగన్నాథం తీరు చర్చనీయాంశమైంది. కలెక్టర్‌ నుంచి ఉత్తర్వులను తెచ్చుకున్నామని అధికారులు చెప్తున్నా, ఆ కాపీని చూప లేదు. ఈ విషయమై ప్రశ్నిస్తే, కనుక్కొని చెప్తానంటూ ఆర్వో చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ఎస్సై కోటిరెడ్డి తీరుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏకగ్రీవమైనట్లు ప్రకటించి.. అభ్యర్థికి ధ్రువీకరణ పత్రమివ్వకుండా కాలయాపన చేయడం వెనుక ఆంతర్యమేమిటని వీరి చలపతిరావు ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement