నెల్లూరు(పొగతోట): పుర, పరిషత్ ఎన్నికల్లో సాగించిన అక్రమాలు, అడ్డదారులు.. పల్లె పోరులోనూ సాగించాలనుకున్న అధికార పార్టీ కుట్రలకు పల్లె తీర్పు చెంపపెట్టుగా మారింది. మూడు పార్టీలతోపాటు టీడీపీ నేతల బెదిరింపులు, నామినేషన్లు చించివేతలు, పోలీసుల అక్రమ అరెస్ట్‌లు, ఎన్నికల ఆర్వోలు ఏకపక్షంగా నామినేషన్ల తిరస్కరణలు, ఫోర్జరీ సంతకాలతో చేసిన విత్‌డ్రా వంటి దాష్టీకాలను దాటుకుని బరిలో నిలిస్తే.. పోలింగ్‌లో రిగ్గింగ్.. కౌంటింగ్‌లో రిగ్గింగ్‌లు.. గెలిచినా.. డిక్లరేషన్లు మార్చేసినా.. ఇలా ఇంత చేసినా.. ఒంటరిగా పోరాటం చేసిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ప్రజాతీర్పుతో ఆ పార్టీ జైత్రయాత్ర సాగింది.
వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్ ఖాయం
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిజాయతీగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే.. వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థులు క్లీన్‌స్వీప్ ఖాయంగా కనిపిస్తోంది. మొదటి దశ ఎన్నికల్లో 44 గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించడం అధికార పార్టీకే కాకుండా.. అక్రమాలకు పాల్పడిన అధికారులు, అరాచకాలకు పాల్పడిన ఖాకీలకు కనువిప్పు కలిగే రీతిలో ఉంది. మొదటి దశలో 8 మండలాల్లో 134 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. రకరకాల దౌర్జన్యాలు చేసిన అధికార పార్టీ 20 పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోగలిగింది. అల్లూరు, బోగోలు, దగదర్తి, జలదంకి, కావలి, కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 44 గ్రామ పంచాయతీలను వైఎస్సార్‌సీపీ కై వశం కావడంతో ఆ పార్టీకి ప్రజల మద్దతు, ఆదరణ తగ్గలేదని గ్రామ పంచాయతీ ఎన్నికలు నిరూపించాయి.
మలి విడతల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయదుందుభి
ఈ నెల 29న, డిసెంబర్ 2న జరిగే మరో రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత ఫలితాలు ప్రతిబింబించనున్నాయి. పుర, పరిషత్ ఎన్నికలను ఏ విధంగా నిష్పక్షపాతంగా నిర్వహించారో అధికారులు, పోలీసులకు ఎరుక. తాజాగా పల్లె ఎన్నికల్లో ప్రజాతీర్పును చూసైనా వీరు తీరు మార్పుకోకపోతే.. భవిష్యత్ ప్రభుత్వం మారితే.. ఆ రోజు చట్టబద్ధమైన విచారణలను ఎదుర్కొక తప్పదనే సంకేతాలు ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఎమ్మెల్యేలు చెప్పారు.. మంత్రులు ఆదేశించారు.. ఎంపీలు చెబుతున్నారని ఇష్టారీతిని వ్యవహరించే అధికారులు.. ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల్లో ఆర్డీఓను ఆదేశించిన మంత్రి ఆనం ఆ తర్వాత ప్లేటు ఫిరాయించి.. ఆమెను అడ్డంగా ఇరికించారనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంది.
అధికార పార్టీ దాష్టీకాలను ఎదురొడ్డి విజయపరంపర
నిజాయితీగా ఎన్నికలు జరిపితే వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల క్లీన్ స్వీపే
తొలి విడత ఫలితాలతో మలివిడతల్లో ప్రజాతీర్పు మార్పు
ప్రజల తీర్పుతోనైనా కనువిప్పుతో అధికారులు, పోలీసులు ఓవరాక్షన్ ఆపకపోతే మూల్యం తప్పదు


