● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
తోటపల్లిగూడూరు: అధికార మదంతో అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం.. ఓటర్లను మభ్యపెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తేలేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని వరిగొండలో శుక్రవారం పర్యటించారు. సర్పంచ్ అభ్యర్థి గూడూరు విష్ణుమోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వాటిని నెరవేర్చకపోగా, స్థానిక సంస్థల ఎన్నికల తరుణంలో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో తమ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఆశించిన స్థాయికంటే ఎక్కువ స్థానాల్లో గెలవడంపై సంతోషం వ్యక్తం చేశారు.
సాగునీరివ్వడంలో విఫలం
తొలి పంటకు సాగునీటిని అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. శ్రీశైలం జలాశయ నీటిని సోమశిలకు తరలించేందుకు ఎందుకు యత్నించలేదని ప్రశ్నించారు. ధాన్యం ధరలు అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం మండలాల్లో నీరు లేక తొలి పంటను వేయలేక రైతులు బాగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకగ్రీవాలను అడ్డుకుంటున్నానంటూ తనపై సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణలను ఖండించారు. టీడీపీ విధానాలనే అడ్డుకుంటున్నామని, ఏకగ్రీవం చేసుకొని పంచాయతీని దోచేస్తామంటే కుదరదని చెప్పారు. వరిగొండలో సర్పంచ్ అభ్యర్థి విష్ణుమోహన్‌రెడ్డి, వార్డు మెంబర్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కామిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, చిల్లకూరు ప్రవీణ్‌రెడ్డి, నెల్లిపూడి సునీల్‌రెడ్డి, చింతంరెడ్డి దశరథరామిరెడ్డి, గండవరం శ్యామలమ్మ, వేమారెడ్డి శ్యామసుందర్‌రెడ్డి, కోట చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సుబ్బరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.


