తలమంచి రెవెన్యూ గ్రామంలో రైతుకు సంబంధించిన పట్టా భూమిలో ఎకరాను రీ సర్వేలో సదరు వ్యక్తికి తెలియకుండానే మరో కర్షకుడి పేరుపై రికార్డుల్లోకెక్కించారు. అధికారులు చేసిన తప్పిదాన్ని సరిచేయాలంటూ అర్జీలను పలుమార్లు ఆయన సమర్పించారు. ఆఫీసర్లు చేసిన తప్పునకు మ్యుటేషన్‌కు ఫీజును సదరు రైతు చెల్లించారు. వీఆర్వోకు లంచాన్నీ ముట్టజెప్పారు. మొదట గ్రీవెన్స్‌లో ఇచ్చినప్పుడే పరిష్కరించామంటూ చూపినా, అదేమీ జరగలేదు. చివరికి రాజకీయ నాయకుల ద్వారా వెళ్తే అప్పటికి కొలిక్కొచ్చింది.
ఆత్మకూరు మండలం రామస్వామిపల్లెకు చెందిన సుబ్బరాయుడికి చెందిన ఒరిజినల్ పట్టా భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు. దీన్ని తొలగించాలంటూ అర్జీని అధికారులకు సమర్పించారు. ఫైల్‌ను వీఆర్వో, తహసీల్దార్ ద్వారా ఎలాగోలా నడిపించారు. అయితే ఆ ఫైల్‌ను కలెక్టరేట్లో తిరస్కరించి బల్క్‌లో కాకుండా విడిగా పంపాలని తెలిపారు. దీన్ని మరోసారి పంపాలని వీఆర్వోను రైతు కోరినా, సమస్య ఎక్కడేసిన గొంగళి అక్కడే అనే చందంగా మారింది. అర్జీ ప్రకారం చూస్తే సమస్యను పరిష్కరించినట్లు ఉంది. ఇలాంటి ఉదంతాలు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నాయి.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులే నిర్లక్ష్యానికి చిరునామాగా మారుతున్నారు. తమ వెతలు తీరుతాయనే భావనతో జిల్లా నలుమూలల నుంచి ఎంతో మంది వ్యయప్రయాసలకోర్చి కలెక్టరేట్కొచ్చి పీజీఆర్ఎస్లో అర్జీలిస్తున్నారు. అయితే వీటిపై క్షేత్రస్థాయిలో సరైన పరిశీలన లేకుండానే అంతా సజావుగా సాగుతోందంటూ రికార్డులను తయారు చేస్తున్నారు. అర్జీలను మండల స్థాయి ఆఫీసర్లకు పంపి సమస్యను పరిష్కరించామంటూ నమోదు చేస్తున్నారు. వీటిపై నిర్వహించిన ప్రీ ఆడిట్ సర్వేలో బయటపడుతున్న లోపాలు ఇప్పుడు జిల్లా అధికార యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని సీఎంఓ తీవ్రంగా పరిగణించింది.
అధ్వానంలో అగ్రస్థానం
రాష్ట్రంలో పనితీరు అధ్వానంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో నెల్లూరు మొదటి స్థానంలో నిలిచింది. దీంతో ఇతర జిల్లాల ఆఫీసర్లతో పాటు జిల్లా ప్రీ ఆడిట్ అధికారులను వెలగపూడికి తక్షణమే రావాలని అత్యవసర ఆదేశాలను సీఎం జారీ చేసింది. ఈ పరిణామాల క్రమంలో పీజీఆర్ఎస్ సమస్యలు ఏ మాత్రం పరిష్కారానికి నోచుకుంటున్నాయాననేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రీ ఆడిట్ బృందంతో పనిచేయించడంలో కలెక్టర్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
రికార్డుల్లో మాత్రం సజావుగా..
సమస్యల పరిష్కారం కోసం ప్రజలు మొదట క్షేత్రస్థాయిలోని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారు పట్టించుకోకపోవడంతో గంపెడంత ఆశతో కలెక్టరేట్‌కు వచ్చి ఒకటికి మూణ్ణాలుగుసార్లు అర్జీలిస్తున్నారు. అయితే కలెక్టరేట్ నుంచి కిందిస్థాయి అధికారులకు పంపి పరిష్కరించామనే రీతిలో చేతులు దులుపుకొంటున్నారు. పరిష్కారంలో జాప్యం, భారీగా పెండింగ్‌లు, ప్రీ ఆడిట్లో వాస్తవ పరిస్థితులు ప్రతిబింబించకపోవడం వంటి అంశాలు సీఎంఓ ఆగ్రహానికి కారణమవుతున్నాయి.
భారీ వ్యత్యాసం
పీజీఆర్ఎస్కు సంబంధించి ప్రభుత్వం నిర్వహించిన ఫీడ్ బ్యాక్ సర్వేలో సమారు 45 శాతం మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ఫిర్యాదులకు సరైన పరిష్కారం దక్కలేదని చెప్పారు. ఈ అంశంలో జిల్లా పూర్తిగా వెనుకబడిందనే అంశాన్ని సీఎంఓ గ్రహించింది. క్షేత్ర స్థాయిలో ప్రీ ఆడిట్ బృంద సర్వేకు.. ప్రభుత్వం జరిపిన సర్వేకు మధ్య భారీ వ్యత్యాసముంది. పీజీఆర్ఎస్లో ప్రీ ఆడిట్ బృందం తీవ్ర నిర్లక్ష్యం చేసిందనే అంశాన్ని తెలుసుకున్న కలెక్టర్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. జిల్లా నోడల్ అధికారిగా జెడ్పీ సీఈఓ మధుసూదన్, అడిషనల్ నోడల్ అధికారిగా డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్యకు బాధ్యతలను అప్పగించారు. ప్రీ ఆడిట్ బృందాన్ని తొలగించనున్నారు. ఈ విషయంలో ఫెయిల్యూర్ అంటే అందుకు హెడ్‌గా ఉన్న కలెక్టర్ వైఫల్యమే కారణమనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
తప్పులకు బాధ్యులెవరో తేల్చేనా..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ప్రీ ఆడిట్ సిబ్బందిని ఇతర విధుల నుంచి తప్పించడమే కాకుండా వారు వెంటనే వెలగపూడిలోని సీఎంఓ – పీజీఆర్ఎస్ కార్యాలయంలో చీఫ్ గ్రీవెన్స్ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంది. అయితే తప్పులు చేసిన వారిని గుర్తించి చర్యలు చేపడతారా లేదాననే అంశమై వేచి చూడాల్సి ఉంది. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై ప్రత్యేక విచారణ ఉంటుందాననేదీ ఆసక్తిగా మారింది.
ఇవీ ఉదాహరణలు..
ప్రీ ఆడిట్‌పై సీఎంఓ కన్నెర్ర
సమస్యను పరిష్కరించకుండానే..రిజాల్వ్ అయిందని నమోదు
వైఫల్యంలో మొదటి స్థానంలో జిల్లా
వెలగపూడికి హాజరుకావాలని ఆదేశాలు
మంచి మార్కులు కొట్టేసేందుకు..
పీజీఆర్ఎస్లో పరిష్కారానికి నోచుకున్నాయని చూపిన అర్జీదారుల సమస్యలను నిజంగా రిజాల్వ్ చేశారాననే అంశంపై ప్రతి మూడు మండలాలకు కలిపి ఒక ప్రీ ఆడిట్ కో ఆర్డినేటర్‌ను నియమించారు. ఇలా జిల్లాలో 15 మంది నియమితులయ్యారు. వీరందరూ క్షేత్రస్థాయిలోకెళ్లి వాస్తవాలను నిగ్గుతేల్చి తేడాలుంటే లెక్కలు చూపాలి. అయితే కలెక్టర్ వద్ద మంచి మార్కులు కొట్టేసేలా అంతా బాగుందంటూ రిపోర్టులిస్తున్నారు. దీంతో తామంతా సజావుగా జరిపామంటూ కలెక్టర్ ఆధ్వర్యంలో గొప్పలు చెప్పుకొంటున్నారు. ఇదంతా ఓ ఎత్తయితే ఈయన్ను రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు ప్రశంసించడం గమనార్హం.
లెక్కల్లో టాప్.. వాస్తవంలో పూర్
జిల్లాలో పీజీఆర్ఎస్ను ప్రారంభించిన తర్వాత 2024, జూన్ 15 నుంచి ఇప్పటి వరకు 98,290 అర్జీలొచ్చాయి. ఇందులో 87,660ను పరిష్కరించినట్టు రికార్డుల్లో నమోదు చేశారు. ఇందులో కొన్ని తిరస్కరణకు గురికాగా, 4005ను మాత్రమే పరిష్కరించాల్సి ఉంది.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందజేసిన అర్జీల విషయంలో జిల్లా యంత్రాంగం అత్యంత నిర్లక్ష్య ధోరణిని కనబరుస్తోంది. క్షేత్రస్థాయిలో రిజాల్వ్ చేయకుండానే అంతా సజావుగా జరిగిందనే రీతిలో నమోదు చేస్తున్నారు. తామేదో ఘనత సాధించామంటూ కలెక్టర్ సైతం ప్రచారార్భాటాలకే పరిమితమవుతున్నారు. సీఎంఓ జరిపిన సర్వేలో వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ తప్పిదాన్ని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి కార్యాలయం.. బాధ్యులకు శ్రీముఖం జారీ చేసి సచివాలయానికి హాజరుకావాలని హుకుం జారీ చేయడం జిల్లాలో ప్రస్తుతం చర్చనీయాంశమైంది.


