● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
నెల్లూరురూరల్: భారత స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గొప్ప దార్శనికుడని ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో సమానత్వం సాధ్యమని విశ్వసించిన ఆజాద్, ప్రతి ఒక్కరికీ విద్యావకాశాలు కల్పించేందుకు జీవితాంతం కృషి చేశారన్నారు. దేశ ప్రగతికి, భావితరాల ఉజ్వల భవిష్యత్‌కు బలమైన పునాదులు వేసిన మహనీయుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆజాద్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలిపారు.
విద్య ద్వారానే
దేశాభివృద్ధి సాధ్యం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరురూరల్: విద్యతోనే పేదరికాన్ని దూరం చేయడంతోపాటు దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయొచ్చని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. బుధవారం నెల్లూరులోని కలెక్టరేట్‌లోని శంకరన్ హాల్లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి, జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ కుల, మత, వర్గ భేదాలు విద్యకు అడ్డంకులు కాకూడదన్నారు. విద్య అనేది ఎవరూ దొంగిలించలేని అమూల్యమైన సంపద అని, ప్రతి ఒక్కరూ ఆసక్తితో చదువుకోవాలని సూచించారు. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, కవిగా, రచయితగా, పాత్రికేయుడిగా, విద్యావేత్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రతి విజయానికి విద్యే పునాది అని పేర్కొన్నారు. ముందుగా మౌలానా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో ఎన్.విజయకుమార్, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారిణి నిర్మలాదేవి, డీసీఓ గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు.
కేన్సర్ ఆస్పత్రి అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం
నెల్లూరురూరల్: నెల్లూరులో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేన్సర్ ఆస్పత్రి అభివృద్ధికి దగదర్తికి చెందిన తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్, తాళ్లూరి రవిప్రసాద్ రూ.10 లక్షల విరాళం అందించారు. తమ తండ్రి రమణయ్య నాయుడు జ్ఞాపకార్థం బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ఈ మొత్తాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఐఆర్‌సీఎస్ కేన్సర్ ఆస్పత్రి కో ఆర్డినేటర్ రంగయ్య నాయుడు, డీఆర్వో ఎన్.విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
మైనర్ వివాహంపై
కేసు నమోదు
సైదాపురం: మండలంలోని తూర్పువీధికి చెందిన బాలికను కూరాకు ప్రశాంత్ అనే యువకుడు ప్రేమ పేరుతో తీసుకెళ్లి వివాహం చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టినట్లు ఎస్సై నాగమల్లేశ్వరరావు బుధవారం తెలిపారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడితోపాటు వివాహానికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరిపైనా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, ఇటువంటి చర్యలకు పాల్పడినా, సహకరించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
కండలేరులో
16.655 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 16.655 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 70, లోలెవల్ కాలువకు 10, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 7 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.70 సన్నవి : రూ.40
పండ్లు : రూ.15


