ప్రతిపక్షాలను అడ్డుకోవడం దారుణం | - | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాలను అడ్డుకోవడం దారుణం

Nov 11 2026 11:55 PM | Updated on Nov 11 2026 11:55 PM

● కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ

● ప్రజాస్వామ్యాన్ని

కాపాడుకునేందుకు పోరాటాలు

● సీపీఎం, సీపీఐ నాయకుల నిరసన

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): ‘ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం దారుణం. రాష్ట్రంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. ఈ ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కింది’ అని వామపక్ష పార్టీల నాయకులు అన్నారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా సీపీఎం, సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరులోని నిరసన ప్రదర్శన నిర్వహించారు. గాంధీబొ మ్మ సెంటర్‌ నుంచి, అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు మూలం రమేష్‌, అరిగెల నాగేంద్రసాయి మాట్లాడుతూ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదన్నారు. అధికార పార్టీ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకున్నారని విమర్శించారు. చిత్తూరు, పుంగనూరు ప్రాంతాల్లో నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన వారిపై కిడ్నాప్‌, దాడులు చేయడాన్ని కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. రిగ్గింగ్‌కు పాల్పడటం, గెలిచిన ప్రతిపక్షాల వారిని విజేతలుగా ప్రకటించకుండా ఓడిపోయిన అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించినట్టు చెప్పడం దారుణమన్నారు. కూటమి నాయకులు చేసిన అక్రమాలను ఖండించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. చెప్పినట్లుగా రెడ్‌బుక్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికులు, రైతుల్ని విస్మరిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగేలా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు భాస్కరయ్య, కత్తి శ్రీనివాసులు, మాదాల వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, సూర్యనారాయణ, అబ్దుల్‌ అజీజ్‌, షాన్‌వాజ్‌, వినోదమ్మ, రెహానా బేగం, కత్తి పద్మ, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement