ఎన్‌ఎంసీ.. అస్తవ్యస్తం | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎంసీ.. అస్తవ్యస్తం

Nov 11 2026 11:55 PM | Updated on Nov 11 2026 11:55 PM

సాక్షాత్తు మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. కానీ ఇక్కడ కార్పొరేషన్‌లో పాలన గాడితప్పింది. ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు సమయపాలన పాటించడం లేదు. విభాగాల్లో ఉద్యోగులు ఏళ్ల తరబడి పాతుకుపోయారు. ఇంకా అవినీతి, అక్రమాలు మితిమీరిపోయాయి.

నెల్లూరు(బారకాసు): కూటమి ప్రభుత్వంలో నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎంసీ)లో పరిపాలనాపరంగా అనేక సమస్యలు నెలకొన్నాయి. ప్రక్షాళణ చేసేందుకు ఎవరో ఒకరు వస్తారని ఎదురు చూడటమే తప్ప కమిషనర్‌గా వచ్చిన ఏ అధికారి కూడా ఇప్పటి వరకు పరిస్థితిలో మార్పు తీసుకురాలేదు. 18 నెలల క్రితం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నందన్‌ అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసి సమస్యలను పరిష్కరిస్తారని ప్రజలు వేచి చూస్తున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. పలువురు అధికారులు, సిబ్బందిని అంతర్గత బదిలీలు చేపట్టారు. అంతేకాకుండా సదరు కమిషనర్‌ కొందరి మాటలు నమ్మి పలు అంశాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలతో పరిపాలన మరింత గాడి తప్పిందని విమర్శలున్నాయి.

అనేక సమస్యలతో..

నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 72 డివిజన్లుండగా 167 సచివాలయాలున్నాయి. 150 కి.మీ మేర విస్తీర్ణం ఉంది. 1,83,643 గృహాలున్నాయి. అందులో దాదాపు 9 లక్షలకు పైగా జనాభా నివాసమున్నారు. ప్రజలకు మౌలిక వసతులు, పౌరసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇందుకు అవసరమైన యంత్రాంగం ఉంది. అయితే నగర పాలక సంస్థలో గాడితప్పిన పరిపానలతో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.

వేలాది మంది ఉద్యోగులు

నగర పాలక సంస్థలో ఇంజనీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌, ఆరోగ్య, రెవెన్యూ, ఎస్టాబ్లిష్‌మెంట్‌ తదితర విభాగాలున్నాయి. వాటికి సంబంధించి వేలాది మంది ఉద్యోగులున్నారు. కానీ కొంతమంది తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. సమయపాలన పాటించకుండా నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు.

అవసరానికి మించి..

ఒక్కొక్క విభాగంలో సిబ్బంది అధికంగా ఉన్నారు. ఎందుకు ఉన్నారో, ఏం చేస్తున్నారో తెలీయదు. తమని ఎవరు అడిగేవారు లేరంటూ వస్తూ పోతూ నెలనెలా జీతాలు తీసుకుంటున్నారు. దీనికి కారణం ఆయా విభాగాలకు చెందిన అధికారులు సక్రమంగా పట్టించుకోకపోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ప్రజలు తమ సమస్యలపై నిత్యం పదుల సంఖ్యలో ఎన్‌ఎంసీ కార్యాలయానికి వచ్చినప్పుడు వారికి సమాధానం చెప్పేవారు ఉండరు. ఒకవేళ ఉన్నా వారికి ముడుపులు ఇస్తేనే పనులు జరుగుతున్నాయి. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం ఇస్తేగానీ సంబంధిత అధికారులు స్పందించడం మినహా మిగిలిన సమయాల్లో కాలక్షేపం చేస్తుంటారన్న విమర్శలున్నాయి.

విధిగా సమీక్షలేవీ?

ఎన్‌ఎంసీలోని ఒక్కో విభాగాన్ని సందర్శించి అందులోని ఉద్యోగులు సయమపాలన పాటిస్తున్నారా? లేదా? సమయానికి హాజరవుతున్నారా లేదా? ఏవిధంగా విధులు నిర్వర్తిస్తున్నారు? ఇలా వారంలో ఒకరోజైనా ఉన్నతాధికారులు పర్యవేక్షించి పూర్తి స్థాయిలో పరిశీలించిన దాఖలాలు లేవు. అలాగే ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో విధిగా సమీక్షలు నిర్వహించి వారి పనితీరును తెలుసుకుంటున్న పరిస్థితి కూడా లేదు.

పరిష్కరించేనా?

కొద్దిరోజుల క్రితం జరిగిన మున్సిపల్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్‌గా గెలుపోందిన రూప్‌కుమార్‌ యాదవ్‌ ఈనెల 23వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త పాలకవర్గం సమస్యలపై దృష్టి సారిస్తుందా? లేకపోతే పాలనను గాలికి వదిలేస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమస్యల పరిష్కారం దిశగా దృష్టి సారించి అడుగులు వేయాలి. లేనిపక్షంలో ఎన్‌ఎంసీ పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యే అవకాశాలున్నాయి.

గాడితప్పిన పరిపాలన

కమిషనర్లు ఎందరు మారినా మార్పు శూన్యం

సమయపాలన పాటించని సిబ్బంది

టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ, పారిశుద్ధ్య విభాగాలపై ఆరోపణలు

పురపాలక శాఖ

మంత్రి ఇలాకాలో ఇదీ పరిస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement