ఏడేళ్ల నిరీక్షణకు తెర
గూడూరు: ఎన్నో నెలల ఉత్కంఠ.. సుదీర్ఘ న్యాయపోరాటాలు.. రాజకీయ వివాదాలకు తెరదించుతూ గూ డూరు పురపాలక సంఘ ఎన్నికలకు నగారా ఎట్టకేలకు మోగింది. కోర్టు కేసుల కారణంగా తొలి విడతలో నిలిచిపోయిన ఎన్నికలకు తాజాగా షెడ్యూల్‌ను ఎస్ ఈసీ విడుదల చేయడంతో పట్టణంలో రాజకీయ వా తావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నామినేషన్లను శనివారం నుంచి సోమవారం వరకు స్వీకరించనున్నారు. పోలింగ్‌ను 26, కౌంటింగ్‌ను 30న చేపట్టనున్నారు.
మారిన రాజకీయ సమీకరణలు
గతంలో ఎన్నడూ లేని విధంగా గూడూరు మున్సిపల్ ఎన్నికలు ఈసారి అత్యంత రసవత్తరంగా మారనున్నాయి. చుట్టుపక్కల ఉన్న ఆరు గ్రామాల విలీనంతో 48 వార్డులతో భారీ మున్సిపాల్టీగా గూడూరు రూపాంతరం చెందింది. దీంతో ఇక్కడ రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. పురపాలక సంఘాన్ని విస్తరించే క్రమంలో సమీపంలోని నెల్లటూరు, చెన్నూరు, దివిపాళెం, చిల్లకూరు, పోటుపాళెం, పురిటిపాళేన్ని విలీనం చేయడం మొదట్నుంచీ వివాదాస్పదంగానే మారింది. వ్యవసాయాధారిత జీవనం దెబ్బతింటుందని.. పన్నుల భారం పెరుగుతుందని.. ముఖ్యంగా ఉపాధి హామీ పనులు కోల్పోతామనే ఆందోళతో హైకోర్టును నెల్లటూరు, చెన్నూరు, చిల్లకూరు గ్రామస్తులు ఆశ్రయించారు. చివరికి పిటిషన్లను కొట్టేస్తూ విలీనాన్ని సమర్థించడంతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి.
ఎటువైపు మొగ్గుచూపుతారో..?
క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు ఆశావహులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక్కో వార్డులో రెండు వేలకుపైగా ఓటర్లతో జాబితా సిద్ధమైంది. పట్టణానికి తోడు ఆరు గ్రామాల ఓటర్లు జతకలవడంతో గెలుపోటముల లెక్కలు తారుమారయ్యాయి. చెన్నూరు, దివిపాళెం, చిల్లకూరు గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. తమ అభీష్టానికి వ్యతిరేకంగా తమ గ్రామాలను గూడూరు మున్సిపాల్టీలో విలీనం చేశారనే అసంతృప్తి ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపుంటే విలీన ప్రక్రియ రద్దయ్యేదనే భావన వీరిలో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో వీరు ఎటువైపు మొగ్గుచూపుతారాననేదే ఆసక్తికరంగా మారింది. కేవలం 14 రోజుల వ్యవధిలోనే నామినేషన్లు, పోలింగ్ ప్రక్రియ ముగియనుండటంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ప్రధాన పార్టీలు ముమ్మరం చేశాయి.
గూడూరు పీఠం భవితవ్యం
న్యాయపరమైన చిక్కులు వీడటంతో
పురపోరుకు లైన్ క్లియర్
48 వార్డులతో ఎన్నికలకు
రేపట్నుంచి నామినేషన్లు
26న పోలింగ్
కావలి మున్సిపల్ ఎన్నికలకు
మోగిన నగారా
కావలి: కావలి మున్సిపల్ ఎలక్షన్లకు నగారా మోగింది. ఈ పరిణామంలో ఏడేళ్ల నిరీక్షణకు తెరపడినట్లయింది. నామినేషన్ల పర్వం శనివారం ప్రారంభమై.. సోమవారంతో ముగియనుంది. పరిశీలనను 16న, ఉపసంహరణకు గడువు 18 వరకు ఉంటుంది. పోలింగ్‌ను 26, లెక్కింపును 30న చేపట్టనున్నారు. దీంతో కావలిలో ఎన్నికల ఫీవర్ నెలకొంది.
కేసు కొలిక్కిరావడంతో..
మున్సిపాల్టీలో చౌదరిపాళెం 2021లో విలీనం కావడంతో కోర్టును పలువురు ఆశ్రయించగా, స్టే విధించారు. ఇప్పుడు కేసు కొలిక్కిరావడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. కావలిలోని 44 వార్డుల్లో జనాభా దాదాపు 1.16 లక్షలు. ఇందులో 82 వేల మంది ఓటర్లున్నారని అధికార గణాంకాలు చెప్తున్నాయి.
జనరల్‌కు కేటాయింపు
కావలి మున్సిపాల్టీ చైర్మన్ స్థానాన్ని జనరల్‌కు కేటాయించారు. దీంతో తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో ఆయా పార్టీలు బిజీగా ఉన్నాయి. బీజేపీకి కేటాయించగా, సీటు కోసం అధిష్టానం వద్ద పలు ఆశావహులు తమ యత్నాలను ముమ్మరం చేశారు. పార్టీ నేతలు కందుకూరు సత్యనారాయణ, భరత్‌కుమార్‌యాదవ్ ముందు వరుసలో ఉన్నారు. పురపోరు రసవత్తరంగా సాగే అవకాశముందనే టాక్ స్థానికంగా నడుస్తోంది.
నగర పంచాయతీ ఎన్నికలు షురూ..
అల్లూరు: అల్లూరుకు నగర పంచాయతీ హోదా వద్దు.. పంచాయతీగానే కొనసాగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న తరుణంలోనే ఎన్నికల నగారా మోగింది. నోటిఫికేషన్‌ను ఎస్‌ఈసీ విడుదల చేయడంతో అల్లూరు, నార్తుమోపూరు, సింగపేట గ్రామస్తులు సందిగ్ధంలో పడ్డారు.
బహిష్కరించాలని తొలుత అఖిలపక్షం నిర్ణయం
అల్లూరును పంచాయతీగా కొనసాగించాలనే డిమాండ్‌తో ఇటీవల అధికార కూటమి పార్టీలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అఖిలపక్షంగా సమావేశమై ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాయి. అయితే తాజాగా షెడ్యూల్ విడుదల కావడంతో ప్రక్రియకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ పరిణామాలతో ప్రజలు మాత్రం అయోమయంలో ఉన్నారు. తాము గెలిస్తే మూడు నెలల్లోపే అల్లూరును నగర పంచాయతీ నుంచి పంచాయతీగా మారుస్తామని కూటమి పార్టీలు పలుమార్లు చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెట్టాయి. రెండేళ్లు దాటినా, ఇప్పటికీ చర్యలు చేపట్టకపోవడంతో గతంలో మాదిరిగా పంచాయతీగానే ఉండాలని కోర్టుకు వెళ్లిన నార్తుమోపూరుకు చెందిన టీడీపీ నేత కేసును విత్ డ్రా చేసుకున్నారు. ఈ పరిణామాలతో ఎన్నికలు అనివార్యమవుతున్నాయి.
పనుల్లేకపోయినా.. పన్నుల మోత
నగర పంచాయతీతో ఎలాంటి ప్రయోజనం లేదని, ముఖ్యంగా అల్లూరు, నార్తుమోపూరు, సింగపేట గ్రామాల్లో రోజువారి కూలీ పనులపై ఆధారపడిన ఎస్టీ, ఎస్సీ జనాభా అధికంగా ఉన్నారు. అల్లూరు నగర పంచాయతీగా మార్చినప్పటి నుంచి పట్టణ ప్రాంత పరిధిలో చేరిన వీరికి ఉపాధి హామీ పనుల్లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన ఏడేళ్లుగా నగర పంచాయతీ హోదాతో అల్లూరుకు ఒరిగిందేమీ లేదు. పట్టణ హోదాతో స్థిరాస్తుల విలువలు పెరగడంతో పేదరిక స్థాయి ధనిక స్థాయికొచ్చి.. సంక్షేమ పథకాలకు అనర్హులుగా మిగిలిపోతున్నారు. మింగను మెతుకు లేకపోయినా.. ధనిక హోదాతో పన్నుల భారం భారీగా పెరిగింది. పన్నులు చెల్లించకపోతే వడ్డీల బాదుడు తప్పడం లేదని ఆందోళన చెందుతున్నారు.
అభివృద్ధికి నోచుకోని అల్లూరు
అల్లూరు మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడే అభివృద్ధి చెందింది. నగర పంచాయతీ హోదా వచ్చినప్పటి నుంచి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయింది. కేవలం గవర్నర్ ఆర్డినెన్స్‌తో నగర పంచాయతీగా కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి గెజిట్ జీఓ రాకపోవడంతో ఇటు పంచాయతీ ఆర్థిక సంఘ నిధులు రాక, అటు మున్సిపల్ నిధులు రాక అభివృద్ధి పనులకు నోచుకోవడం లేదు.


