ఓటమి భయంతో నాడు టీడీపీ పలాయనం | - | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతో నాడు టీడీపీ పలాయనం

Nov 13 2026 4:23 AM | Updated on Nov 13 2026 4:23 AM

● ఇప్పుడు ఒత్తిళ్లను ఎదుర్కొని

వైఎస్సార్సీపీ వీరోచిత పోరు

● సర్వేపల్లిలో మూడో వంతు

ఎంపీటీసీ స్థానాలు కై వసం

● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

పొదలకూరు: ఓటమి భయంతో 2021లో నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ వెనుకడుగేసి అస్త్రసన్యాసం చేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడారు. అప్పట్లో అధికారంలో ఉన్న తమ పార్టీని ఎదుర్కొనే ధైర్యం లేక టీడీపీ శ్రేణులు పలాయనం చిత్తగించారని, అనేక ప్రాంతాల్లో పోటీకి దూరంగా ఉండిపోయారని తెలిపారు. ఇప్పుడు అధికార పార్టీకి ఎదురొడ్డి తమ పార్టీ వీరోచితంగా పోరాటం చేసిందని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీకి రాజకీయ బలం, అధికార యంత్రాంగం అందుబాటులో ఉన్నా, తమ పార్టీ శ్రేణులెక్కడా వెనుకడుగేయలేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ నుంచి దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమ కేసులు, అధికార దుర్వినియోగం లాంటి పరిణామాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, ప్రలోభాలకు లొంగకుండా పార్టీ అభ్యర్థుల తరఫున శ్రేణులు క్షేత్రస్థాయిలో పోరాటాన్ని సాగించారని వివరించారు.

ఉత్సాహాన్నిచ్చిన ఫలితాలు

సర్వేపల్లి నియోజకవర్గంలో వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు తమ పార్టీకి రాజకీయంగా ఉత్సాహాన్నిచ్చాయని పేర్కొన్నారు. మూడో వంతు స్థానాలను సాధించడం సాధారణ విషయం కాదని చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే టీడీపీకి ఓట్ల శాతం గణనీయంగా తగ్గిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి కార్యకర్తల అంకితభావం, నాయకత్వంపై నమ్మకం, ప్రజల ఆదరణే ప్రధాన బలంగా నిలుస్తాయని పేర్కొన్నారు. పోరాటమే తమ పార్టీకి బలమని, వెనుకడుగేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement