ప్రయాణం నరకం | - | Sakshi
Sakshi News home page

ప్రయాణం నరకం

Sep 29 2026 11:58 PM | Updated on Sep 29 2026 11:58 PM

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఏటా కేంద్రం మంజూరు చేసే ‘వీబీజీ రామ్‌జీ’ (ఉపాధి హామీ) పథకం నిధులతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ తమ ఘనతగా డప్పుకొట్టుకునే ‘పల్లె పండగ’ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభించారు. వరికుంటపాడు మండలం రామాపురంలో సరికొత్త ఈవెంట్‌కు శ్రీకారం చుట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ను పక్కన పెట్టుకుని అబద్ధాలు.. తప్పుడు ప్రచారంతో ఈవెంట్‌ను రక్తి కట్టించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రూ.11080 కోట్ల నిధులు కేటాయించింది. ఇది తన ఘన కార్యమన్నట్లు గొప్పలు చెప్పుకుంటూ పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండమంటూ ఈవెంట్‌ పేరుతో రూ.46 కోట్ల ప్రజాధనాన్ని దుబారా చేయడంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు రెండు రోజులుగా నరకం చూపించారు. ఈ ఈవెంట్‌కు జనాన్ని తరలించేందుకు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాలతోపాటు సమీప జిల్లాల్లోని డిపోల నుంచి కూడా 2500 ఆర్టీసీ బస్సులను ఇక్కడికి మళ్లించారు. ఉపాధి కూలీలు, పొదుపు మహిళలను బెదిరించి, భయపెట్టి సభకు తరలించడంతో ఇబ్బందులు పడ్డారు. ఆయా డిపోల పరిధిలో నిత్యం రాకపోకలు సాగించే సామాన్యులు తమ గమ్యస్థానాలకు బస్సుల్లేక నానా అగచాట్లు పడ్డారు.

అబద్ధాలు.. పొగడ్తలు

పల్లెపండగ పేరుతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ నిర్వహించిన ఈవెంట్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కళ్లకు కనిపించే అభివృద్ధిని సైతం కళ్లార్పకుండా అబద్ధాలను వల్లివేయడంతో ఇద్దరూ పోటీ పడ్డా రు. చంద్రబాబు బద్ధాలు ఆడడంతో దిట్టని మరోసారి రుజువైంది. సార్వత్రిక ఎన్నికల వేళ చెప్పిన సూపర్‌ సిక్స్‌ పథకాలన్నీ నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఇవ్వకపోయినా అమలు చేస్తున్నట్లు బుకాయించడతో సభికులు ఆశ్చర్యపోయారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధే జరగలేదంటూ చెప్పడంతోపాటు, ఈ రెండేళ్ల కాలంలోనే 9 వేల కి.మీ. రోడ్లు వేశామని కాకి లెక్కలు చెప్పుకొచ్చారు. పంచాయతీల్లో సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, గ్రంథాలయాలు, నాడు–నాడు స్కూళ్లు అభివృద్ధి ఎప్పుడు జరిగిందంటూ సభికులు చెవులు కొరుక్కోవడం గమనార్హం. నాలుగు సార్లు సీఎం అన్ని చెప్పుకున్న బాబు రాష్ట్రంలో సమస్యలన్ని ఈ రెండేళ్లనే తీర్చేశానంటూ చెప్పుకొచ్చారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ తానే నిర్మించానంటూ మరోసారి క్రిడెట్‌ చోరీకి పాల్పడ్డాడు. ఉదయగిరి రూపురేఖలు మార్చేస్తానంటూ, దగదర్తి విమానాశ్రయం, సోమశిల హైలెవల్‌ కెనాల్‌ నిర్మించేస్తానంటూ గతంలో చెప్పిన హామీలే మళ్లీ మళ్లీ వల్లివేశారు.

ఉపాధి నిధులతో

పల్లె పండగ ఈవెంట్‌

రూ.46 కోట్ల ప్రజాధనం దుబారా

ఉపాధి కూలీలు, పొదుపు మహిళలను భయపెట్టి సభకు తరలింపు

ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లోని డిపోల నుంచి 2500 ఆర్టీసీ బస్సుల్లో జనసమీకరణ

రాష్ట్ర అప్పుల విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం అంకెల గారడీ

కళ్లార్పకుండా చంద్రబాబు అబద్ధాల వల్లెవేత

సూపర్‌సిక్స్‌ పథకాలన్నీ

ఇచ్చేశామంటూ బుకాయింపు

ఈ రెండన్నరేళ్లలోనే అభివృద్ధి

చేశానంటూ మళ్లీ మళ్లీ క్రెడిట్‌ చోరీ

రాష్ట్ర అప్పులపై చెరో లెక్క

రాష్ట్రంలో గత ప్రభుత్వం అప్పుల విషయమై సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌కల్యాణ్‌లు చెప్పిన గణాంకాలకు సభికులు నోరెళ్లబెట్టారు. రూ.2 లక్షల కోట్లు అప్పు చేశారని పవన్‌ కల్యాణ్‌ చెప్పగా, చంద్రబాబు మాత్రం రూ.10 లక్షల కోట్లు అప్పు చేశారని మరోసారి అబద్ధాలను కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో రెండేళ్ల కాలంలోనే రూ.22 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని బాబు బుకాయించారు. కానీ ఇటీవలే పార్లమెంట్‌ సాక్షిగా రూ.6 వేల కోట్లే పెట్టుబడులుగా వచ్చాయని స్పష్టమైతే.. చంద్రబాబు మాత్రం యథా ప్రకారం కాకి లెక్కలు చెప్పడంపై సభికులు పెదవి విరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement