● అధికారులకు బాధ్యతల కేటాయింపు
● ఎండలో ఇబ్బంది పడిన ప్రజలు
● తాగునీరు, భోజనం లేక విలవిల
వరికుంటపాడు: మండలంలోని రామాపురంలో మంగళవారం నిర్వహించిన పల్లె పండగ – 3.0 కార్యక్రమానికి జసమీకరణ కోసం అధికారులు నానా అవస్థలు పడ్డారు. రాజకీయ నేతలు చేయాల్సిన పనులను సచివాలయ సిబ్బందికి అధికారులు అప్పగించారు. ఫలితంగా గ్రామాల్లో వీరు బసచేసి జనాలను తరలించే పనిలో నిమగ్నమయ్యారు. గ్రామాల్లోని పొదుపు గ్రూపు సభ్యులను తరలించే బాధ్యతను వీఆర్వోలు, పొదుపు గ్రూపుల లీడర్లు తీసుకున్నారు. ఉపాధి పథకానికి సంబంధించిన కూలీలను క్షేత్ర సహాయకులు బలవంతం చేసి ప్రభుత్వం సమకూర్చిన ఆర్టీసీ బస్సుల్లోకెక్కించారు. కొన్ని నియోజకవర్గాల్లో రూ.200 నుంచి రూ.400 చొప్పున నగదుతో పాటు భోజనం, మద్యం బాటిళ్లను అందజేశారు. భోజన బాధ్యతను సివిల్ సప్లయ్స్ అధికారులు తీసుకోగా, సభా ప్రాంగణంలో ఇది అందక చాలా మంది ఆకలితో అలమటించారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక.. సమీప ప్రాంతాల్లో నిలిచేందుకు నీడ లేక అనేక మంది అవస్థ పడ్డారు. కొంతమంది మహిళలు, వృద్ధులు సొమ్మసిల్లారు.
కూలీలకు బెదిరింపులు
కార్యక్రమానికి వచ్చే ఉపాధి కూలీలకు మస్తర్లేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని, లేకపోతే పనులకు రానీయమంటూ క్షేత్ర సహాయకులు బెదిరించారనే ఆరోపణలు వినిపించాయి. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ పాఠశాలల వాహనాలనూ సభకు పంపారు. ఏపీఎంలు, ఏపీఓలకు టార్గెట్లిచ్చి జనాలను తరలించారు. సమావేశం సాయంత్రం ఐదు గంటలకు ముగియడంతో తిరిగెళ్లేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. మొత్తమ్మీద పల్లె పండగ సభను సక్సెస్ చేసేందుకు అధికార యంత్రాంగం పడిన తిప్పలను చూసి ప్రజలు అయ్యో.. పాపం అంటూ నిట్టూర్చారు.
తాగునీటి కోసం ఎగబడుతూ..


