● స్థానిక సంస్థల ఎన్నికలు కీలకం
● కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు: నిరంకుశంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వంపై పోరాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిద్దామని.. మీ జోలికెవరొచ్చినా అండగా తాను నిలిచి పోరాటంలో పాల్గొంటానని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని విరువూరులో మాజీ సర్పంచ్, పార్టీ సర్వేపల్లి బూత్ లెవల్ కన్వీనర్ బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఎన్నికల కార్యాచరణపై పంచాయతీల వారీగా నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన కాకాణి మాట్లాడారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల వారీగా పరిస్థితిని సమీక్షించి.. శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నామని వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్.. ఎలాంటి ఎన్నికలొచ్చినా సంసిద్ధంగా ఉండాలని సూచించారు. చంద్రబాబు తరహాలో ఓటమికి భయపడి పారిపోయే మనస్తత్వం తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి లేదని చెప్పారు. ఓడిపోతామనే గత స్థానిక ఎన్నికలకు చంద్రబాబు దూరంగా ఉన్నారని విమర్శించారు. ఎన్నికల షెడ్యూల్ వారంలో విడుదలయ్యే అవకాశముందన్నారు.
బెదిరింపులకు భయపడబోం
తమ పార్టీ శ్రేణులను ప్రభుత్వం బెదిరించి ఎన్నికల్లో విజయం సాధించేందుకు యత్నిస్తోందని, దీనికి భయపడేదిలేదని తేల్చిచెప్పారు. ఓట్లేయకపోతే పింఛన్లను నిలిపేస్తామనే దుర్మార్గమైన ఆలోచనలో ఉందని మండిపడ్డారు. పల్లె పండగ.. కూటమి దండగగా మారిందని.. తనకున్న బలం చాలక పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు వెంటబెట్టుకొని జిల్లా పర్యటనకు వచ్చారని పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో మోసం చేస్తున్నారని.. రోడ్లను నిర్మించకపోగా ఎమ్మెల్యే సోమిరెడ్డి ధనదాహానికి ఉన్న రహదారులు నాశనమవుతున్నాయని మండిపడ్డారు. భారీ ఇసుక లారీలు విరువూరు నుంచి పొదలకూరు మీదుగా అక్రమంగా వెళ్తూ రోడ్లను ధ్వంసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
డబుల్ గేమ్ ఆడేవారిని రానివ్వం
పార్టీ శ్రేణులు ఎలాంటి ఆలోచనలకు తావివ్వొద్దని.. డబుల్ గేమ్ ఆడే నేతలను అధికారంలోకి వస్తే గడప కూడా తొక్కనిచ్చేది లేదని చెప్పారు. ఎమ్మెల్యేగా రెండుసార్లు, మంత్రిగా పనిచేశానని, మరోసారి శాసనసభ్యుడ్నైతే లెక్కలను సరిచేస్తానని తెలిపారు. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న పార్టీ శ్రేణులకు సాయమందించి ఆదుకుంటానని ప్రకటించారు. భగవంతుడ్ని తాను ఇదొక్కటే కోరుకుంటున్నానని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులను ఇబ్బందులు పెడుతున్న టీడీపీ నేతలను తర్వాత ఎవరు కాపాడతారని.. వారికి వత్తాసు పలుకుతున్న అధికారులు పదింతల బాధలు పడక తప్పదని స్పష్టం చేశారు. నేతలు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, హరిశ్చంద్రారెడ్డి, నారాయణరెడ్డి, బాలకొండారెడ్డి, ఆనంద్‌రెడ్డి, శ్రీహరి, ఇంద్రసేన్‌గౌడ్, దశకంఠాద్రిశర్మ తదితరులు పాల్గొన్నారు.


