ఫైనాన్స్‌ వేధింపులతో యువకుడి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

ఫైనాన్స్‌ వేధింపులతో యువకుడి ఆత్మహత్యాయత్నం

Sep 29 2026 11:58 PM | Updated on Sep 29 2026 11:58 PM

కావలి: ఫైనాన్షియర్ల వేధింపులను తాళలేక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పట్టణంలోని ఇందిరానగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. ఇందిరానగర్‌కు చెందిన దేవరకొండ రాజా పట్టణంలోని వీల్స్‌ మార్ట్‌లో ఫైనాన్స్‌లో ద్విచక్ర వాహనాన్ని తీసుకున్నారు. అయితే కొద్ది రోజులకే అందులో ఇబ్బంది ఏర్పడటంతో కంపెనీ వారిని సంప్రదించి మరో వెహికల్‌ను కావాలని కోరారు. దీనికి సమ్మతించిన వారు మరో వాహనాన్ని అందజేసి, అదనంగా కొంత మొత్తం ఇవ్వాలనే షరతును విధించారు. ఆ తర్వాత పది రోజులకు ఈ మొత్తం కోసం రాజా కుమారుడు సంజయ్‌ను వారు సంప్రదించారు. తాము ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నామని, కొంత వ్యవధి కావాలని ఆయన కోరగా, దానికి అంగీకరించకుండా వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్తాపం చెందిన సంజయ్‌.. పెయింట్‌లో కలిపే టిన్నర్‌ను సేవించారు. గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఏరియా వైద్యశాలకు తరలించారు. కాగా వాహనాన్ని తాను తీసుకుంటే తన కుమారుడ్ని వేధింపులకు గురిచేయడమేమిటని రాజా ప్రశ్నించారు. ఏదైనా జరిగితే ఫైనాన్స్‌ వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

న్యాయవాదుల విధుల

బహిష్కరణ రేపు

నెల్లూరు (లీగల్‌): కోర్టు విధులను న్యాయవాదులు గురువారం బహిష్కరించనున్నారని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు అయ్యప్పరెడ్డి, జల్లి పద్మాకర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు బార్‌ అసోసియేషన్‌ సభ్యుడు, జూనియర్‌ న్యాయవాది శ్రీదుర్గ సాయిపై వేదాయపాళెం ఎస్సై ప్రసాద్‌రెడ్డి దురుసు ప్రవర్తనకు నిరసనగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు సహకరించాలని కోరారు.

2న కబడ్డీ జిల్లా

జట్ల ఎంపికలు

సంగం: రాష్ట్రస్థాయి అంతర్‌ జిల్లాల జూనియర్స్‌ బాలురు, బాలికల కబడ్డీ చాంపియన్‌ షిప్‌ పోటీలకు సంబంధించిన జిల్లా జట్టును నెల్లూరులోని సర్వోదయ కళాశాల గ్రౌండ్స్‌ లో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ఎంపిక చేయనున్నామని కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు హరీష్‌, జనరల్‌ సెక్రటరీ సతీష్‌బాబు తెలిపారు. ఈ మేరకు మండలంలోని దువ్వూరులో విలేకరులతో మంగళవారం మాట్లాడారు. బాలుర విభాగంలో గరిష్ట బరువు 75 కిలోలుండాలని.. 2006, నవంబర్‌ 4న లేదా ఆ తర్వాత జన్మించిన వారు అర్హులని తెలిపారు. బాలికల విభాగంలో గరిష్ట బరువు 65 కిలోలుండాలని, 2006 నవంబర్‌ 29న లేదా ఆ తర్వాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. క్రీడాకారులు తమ ఆధార్‌ కార్డు, జనన ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకురావాలని కోరారు. మ్యాట్‌ షూస్‌ తప్పనిసరని తెలిపారు. మార్కాపురంలో రాష్ట్ర స్థాయి పోటీలను అక్టోబర్‌ 16 నుంచి 18 వరకు నిర్వహించనున్నారని వివరించారు. వివరాలకు 72785 55777 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

శ్రీవారి దర్శనానికి

24 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువ గా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. స్వామివారిని 84,171 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 36,671 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.16 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement