సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు మాఫియాలుగా అవతరించారు. ఇసుక, గ్రావెల్, మట్టితో వేల రూ.కోట్లు దోచుకుంటున్నారు. ఒక్క ఇసుక తవ్వకాలతోనే ఏకంగా నెలకు రూ.వెయ్యి కోట్ల దోపిడీ జరుగుతోందంటే అతిశయోక్తి లేదు. పెన్నానదిలో సోమశిల నుంచి ఇందుకూరుపేట వరకు సుమారు 20 అనధికార రీచ్‌లు కొనసాగుతున్నాయి. ప్రతి రీచ్‌లో నెలకు సగటున రూ.50 కోట్ల మేర ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. పర్యావరణ నిబంధనల మేరకు అక్టోబరు 15వ తేదీ పెన్నానదిలో ఇసుక తవ్వకాలకు అనుమతి లేకపోయినప్పటికీ.. నెల్లూరు పెన్నాబ్యారేజీ, సంగం బ్యారేజీ వద్ద డీలిస్టింగ్ పేరుతో అనుమతులు తీసుకుని యంత్రాలు పెట్టా తవ్వేస్తున్నా.. అధికార యంత్రాంగం మౌనంగా వ్యవహరిస్తోంది. గడిచిన 28 నెలలుగా ఎన్‌జీటీ అనుమతులు లేకుండానే.. డీసిల్టింగ్ అనుమతులతో పెన్నానదిని విధ్వంసం చేస్తున్నారు. నెల్లూరు రూరల్, నెల్లూరు నగర పరిధి పొట్టేపాళెంతోపాటు పెన్నాపోర్టుకట్ల, భగత్‌సింగ్‌కాలనీ, దిగువ ప్రాంతాల్లో నిత్యం ట్రాక్టర్లతో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.
ఇక సర్వేపల్లి, ఆత్మకూరు, గూడూరు, ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో దాదాపు రూ.100 నుంచి రూ.150 కోట్లకు పైబడి వ్యవసాయ భూములు, కమర్షియల్ స్థలాలు ఆక్రమించారు. రెవెన్యూ రికార్డుల్లో పేర్లను మార్పులు చేసుకున్నారు. సర్వేపల్లి, నెల్లూరు, ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో సాగునీటి కాలువల్లో పూడిక తీత, వరద ప్రభావిత ప్రాంతాల్లో తాత్కాలిక రిపేర్లతో సుమారు రూ.120 కోట్ల మేర దోచుకుతిన్నారు. ఆయా పనులను టెండర్లు లేకుండా టీడీపీ నేతలతో చేయించేందుకు ఏకంగా నిబంధనలనే మార్చేశారు. నామినేటెడ్ పేరుతో పనులు కట్టబెట్టి.. పనులు చేయకుండానే దిగమింగేశారు. సోమశిల ప్రాజెక్ట్ చైర్మనే ఏకంగా కాలువల్లో పూడికి తీత, ఫ్లడ్ డ్యామేజ్ పనుల పేరుతో పైసా పనులు చేయకుండానే ఏకంగా రూ.10 కోట్లు స్వాహా చేసిన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతుండడంతో దోపిడీకి అద్దం పడుతోంది. నెల్లూరు నగరంలో వివిధ అభివృద్ధి పనులు, పారిశుధ్యం, పచ్చదనం, ఉపాది కల్పన తదితర పేర్లతో రూ.వందల కోట్ల కాజేస్తున్నారు.
ఇసుక, గ్రావెల్, భూముల దోపిడీలో ఆత్మకూరు పోటీ
భూ ఆక్రమణలు, పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తరలింపు, గ్రావెల్ దోపిడీలో ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ నేతలు పోటీపడుతున్నారు. ఆత్మకూరు మండలం అప్పారావుపాళెం పెన్నానది ఇసుక రీచ్‌లో 80 వేల మెట్రిక్ టన్నుల తవ్వకాలకు అనుమతులు ఉండగా నిత్యం 5 వేల నుంచి 6 వేల మెట్రిక్ టన్నులు తవ్వేసి తరలిస్తున్నారు. ఈ లెక్కన నెలకు 1.50 లక్షల నుంచి 1.80 లక్షల మెట్రిక్ టన్నులు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
● నియోజకవర్గంలోని అనంతసాగరం మండలం పడమటికంభంపాడు పెన్నానది ఇసుక రీచ్‌కు ఎలాంటి అనుమతులు లేకపోయినా నిత్యం వందకుపైగా లారీలు, టిప్పర్లతో ఇసుకను బద్వేల్ మీదుగా దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తాజాగా అనంతసాగరం మండలం ఉప్పలపాడు వద్ద అనధికారికంగా ఇసుక రీచ్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నించగా సమీప గ్రామాల రైతులు, స్థానికులు గట్టిగా వ్యతిరేకించడంతో తాత్కాలికంగా నిలిపివేశారు.
● చేజర్ల మండలం మడపల్లి, పెరుమాళ్లపాడు, సంగం, అనుమసముద్రంపేట మండలం కొండమీదకొండూరు గ్రామాల్లో విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి.
● మర్రిపాడు మండలంలోని పలు గ్రామాల్లో వందల ఎకరాలు ప్రభుత్వ, అసైన్డ్ భూములను స్థానిక టీడీపీ నాయకులు యథేచ్ఛగా ఆక్రమించి జామాయిల్, సరుగుడు మొక్కలను సాగు చేస్తున్నారు. వీటి విలువ సుమారు రూ.5 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. చేజర్ల మండలం పెళ్లేరులో వందలాది ఎకరాలు భూములను ఆక్రమించారు. వీటి విలువ రూ.2 కోట్లకుపైగా ఉంటుంది. ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి, బోయలచిరివెళ్ల అటవీ ప్రాంతాల్లో భూములను ఆక్రమించి సాగుకు సిద్ధం చేస్తున్నారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుంది.
ఇసుక, సిలికా దోపిడీ.. భూ ఆక్రమణలు
గూడూరు నియోజకవర్గంలో ప్రకృతి సంపద ఇసుక, సిలికా, మట్టి దోపిడీ అప్రతిహతంగా సాగుతోంది. ఇక గూడూరు పట్టణంలోని రూ.కోట్లు విలువైన ప్రభుత్వ స్థలాలతోపాటు చిల్లకూరు, చిట్టమూరుల్లో వ్యవసాయ, తీర ప్రాంతం భూములు ఆక్రమణలకు గురయ్యాయి. వీటి విలువ మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ.30 నుంచి రూ.40 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కోట మండలం గూడలిలో ప్రభుత్వం ఇసుక రీచ్‌ను అనుమతించింది. దీంతో కోట మండలం గూడలి నుంచి చిట్టమూరు మండలం మెట్టు వరకు స్వర్ణముఖిలో అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు. ప్రతి రోజు కనీసం 100 టిప్పర్ల వరకు ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలివెళ్తున్నాయి.
గ్రావెల్ అక్రమ తవ్వకాలు
జాతీయ రహదారుల నిర్మాణాలు వరంలా మారడంతో అధికార పార్టీ నాయకులు గూడూరు మండలంలో చెమ్మర్తి గొల్లపల్లి గ్రావెల్, చెన్నూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువుల్లో మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. నిత్యం 50 టిప్పర్లకు తక్కువ లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్నారు. చిల్లకూరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పేదల భూముల్లోని గ్రావెల్‌ను సాగరమాల ప్రాజెక్టుకు రోజుకు 100 నుంచి 150 టిప్పర్ల వరకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చిటమూరు మండలం ఏకశిరి, చిట్టమూరు తదితర గ్రామాల్లో ప్రతి రోజు కనీసం 70 నుంచి 100 టిప్పర్ల మట్టి, గ్రావెల్ తరలిస్తున్నారు.
రూ.కోట్ల విలువైన భూములు..
చిల్లకూరు మండలం కడివేడులో రూ.కోట్ల విలువైన సుమారు 50 ఎకరాల వరకు జాతీయ రహదారికే ఆనుకొని ఉన్న భూములు ఆక్రమించి.. ఏకంగా రెవె న్యూ రికార్డుల్లో పేర్లను మార్చుకున్నారు. చిట్టమూరు మండలం తీర ప్రాంతంలో సుమారు 100 ఎకరాల వరకు భూములు ఆక్రమణలకు గురయ్యాయి.
డీసిల్టింగ్ పేరుతో..
కోవూరులో డీసిల్టింగ్ పేరుతో కొంత.. పోతిరెడ్డిపాళెం, జమ్మిపాళెం, వేగూరు, బుచ్చిరెడ్డిపాళెం మినగల్లు, విడవలూరు మండలం ముదివర్తి, ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు తదితర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. ఆయా ప్రాంతాల నుంచి రోజుకు దాదాపు 100 టిప్పర్ల వరకు ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం.
చెరువుల్లో గ్రావెల్ మాఫియా
ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు, కలిగిరి, జలదంకి మండలాల్లోని పలు చెరువుల్లో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతూ అక్రమార్జనకు పాల్పడుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా పచ్చ నేతలు రేయింబవళ్లు గ్రావెల్, మట్టి తరలిస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల ప్రమేయం ఉండడంతో పోలీసు, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురం, ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు, కొండాపురం మండలాల పరిధిలో ప్రవహిస్తున్న పిల్లాపేరు పరీవాహక ప్రాంతంలో ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది.
టీడీపీ @ తమ్ముళ్ల దోపిడీ పార్టీ
కొల్లగొట్టుతున్న ఇసుక, గ్రావెల్, మట్టి
రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పైబడి ప్రభుత్వ, వ్యవసాయ,
కమర్షియల్ భూముల కబ్జా
రేషన్ బియ్యంతో రూ.కోట్ల సంపాదన
ఇరిగేషన్ వర్కుల్లో పైసా
పనిచేయకుండానే రూ.కోట్లు స్వాహా
అభివృద్ధి పనుల పేరిట విచ్చలవిడిగా దోపిడీ
ప్రకృతి సంపద దోపిడీలో సర్వేపల్లి టాప్
సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం, పొదలకూరు, మనుబోలు మండలాల్లో అధికార పార్టీ నాయకులు అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తున్నారు. వెంకటాచలం మండలంలో అక్రమంగా గ్రావెల్ రూ.కోట్లలో నిర్వహిస్తున్నారు. సర్వేపల్లి పంచాయతీ నాగబొట్లకండ్రికలో స్వయంగా ప్రధాన నాయకుడు కనుసన్నల్లో అక్రమంగా గ్రావెల్‌ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పొదలకూరు మండలం చిట్టేపల్లితిప్ప నుంచి అనుమతుల పేరుతో విచ్చలవిడిగా పట్టపగలే గ్రావెల్‌ను తరలిస్తున్నారు. మనుబోలు మండలం వీరంపల్లి, బద్వేల్ నుంచి తరచుగా తరలిస్తున్నారు.
పొదలకూరు మండలం సూరాయపాళెం వద్ద పెన్నానదిలో నిబంధనలకు విరుద్ధంగా డ్రెడ్జింగ్ చేయకుండా నేరుగా నదీగర్భం నుంచే ఇసుకను తోడి అక్రమంగా తరలిస్తున్నారు. విరువూరు రీచ్‌కు యార్డు అనుమతులు ఉన్నా.. ఇక్కడ సైతం నిబంధనలను తుంగలో తొక్కి ఇసుకను తోడేస్తున్నారు. రెండు రీచ్‌ల నుంచి ప్రతి నిత్యం రేయింబవళ్లు సుమారు 50 నుంచి 60 టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్నారు.
భూకబ్జాల్లోనూ తగ్గేదేలే..
వెంకటాచలం మండలంలో ముఖ్యనేత కనుసన్నల్లోనే కబ్జాల పర్వం కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జాతీయ రహదారి అనుకుని ఉన్న రూ.కోట్లు విలువైన భూమిలో అధికార పార్టీకు చెందిన నాయకులు వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. మండలంలో దేవాలయ భూములను సైతం వదలడం లేదు. సర్వే నంబరు 118/1లో దేవస్థానానికి చెందిన 25 సెంట్ల స్థలం, చెముడుగుంటలో 118/2లో శివాలయం భూములు 1.66 ఎకరాలను ఆక్రమించి పాట్లు, రోడ్లు వేస్తున్నారు. కసుమూరులో సుమారు రూ.20 కోట్లు విలువైన భూములను కబ్జా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వ భూములను చదును చేస్తున్న అధికార పార్టీ నాయకులు ఆక్రమించి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కావలి నియోజవకర్గంలో గ్రావెల్ దోపిడీ అప్రతిహతంగా జరుగుతోంది. కావలి మండలం ఆముదాలదిన్నె చెరువు నుంచి ఓ టీడీపీ లీడర్ గ్రావెల్‌ను తాను వేస్తున్న లే అవుట్‌కు రేయింబవళ్లు విచ్చలవిడిగా తరలిస్తున్నారు. ట్రిప్పు గ్రావెల్‌కు రూ.7 వేలు, మట్టికి రూ.5 వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. సర్వాయపాళెం పంచాయతీ ఆనెమడుగు చెరువు నుంచి ఓ టీడీపీ నేత, రియల్టర్ గ్రావెల్‌ను నిర్విరామంగా తరలిస్తున్నారు. చెన్నాయపాళెం, రుద్రకోట, ఆర్‌సీపాళెం, అడవిరాజుపాళెం, సిరిపురం తదితర గ్రామాల నుంచి గ్రామాల చెరువులను గ్రావెల్, మట్టి దోపిడీతో ఖాళీ చేశారు.


