● విధులు బహిష్కరించి ఆందోళన
● బారాషహీద్ గ్రౌండ్స్ నుంచి భారీ ర్యాలీ
● కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన
నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ప్రభుత్వ తీరుపై కన్నెర్ర చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్య ధోరణి వీడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. తొలుత బారాషహీద్ దర్గా వద్దకు చేరుకుని అక్కడి నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఎన్‌ఎంసీ కార్యాలయం వరకు కొనసాగించి, కార్యాలయంలోకి వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ నెల్లూరు నగర గౌరవాధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, రూరల్ కార్యదర్శులు పెంచల నరసయ్య, నాగేశ్వరరావు మాట్లాడుతూ పదవులు, అధికారంపై ఉన్న శ్రద్ధ కష్టపడి పనిచేసే కార్మికులపై లేకపోవడం సిగ్గుచేటన్నారు. చెత్తాచెదారం, మలినాల మధ్య పనిచేస్తూ కార్మికులు తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్నారని, అటువంటి వారి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. 60 సంవత్సరాల వయసు నిండిందనే నెపంతో నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగిస్తున్నారని విమర్శించారు. గ్రాట్యుటీ చట్టం ప్రకారం ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే అన్ని నెలల జీతాలు ఇవ్వాలని చట్టం చెబుతున్నప్పటికీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా పనిలో నుంచి తొలగిస్తున్నారని చెప్పారు. మృతిచెందిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇచ్చే ఆనవాయితీని నిలిపివేశారని పేర్కొన్నారు. పీఆర్సీ ప్రకారం ఆప్కాస్ ఉద్యోగులకు జీతాలు పెరగడం లేదన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి జీతం ఇస్తున్నారని, సచివాలయం వెబ్‌సైట్‌లో ప్రభుత్వ ఉద్యోగిగా నమోదు చేయడం వల్ల ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో పస్తులతో, అప్పులతో జీవితాలు గడుపుతున్నామని వాపోయారు. అనంతరం కమిషనర్ నందన్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆరం సునీల్‌కుమార్, మట్టిపాటి శ్రీనివాసులు, సుజాతమ్మ, వజ్రమ్మ, రాంబాబు, మాలకొండయ్య, షబ్బీర్, మరియన్న, తాళ్లూరి రమేష్, నాగేశ్వరరావు, శివ, షఫీ, లోకేష్, పందల శ్రీనివాసులు, భాగ్యమ్మ, కొండమ్మ, సలోమి, చంద్రమ్మ, యోహాను, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.


