వెంకటాచలం: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పోరాడతామని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని సర్వేపల్లిలో పార్టీ శ్రేణులతో సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికలను ఏకపక్షంగా మార్చేందుకు చంద్రబాబు నేతృత్వంలో అనేక అక్రమ మార్గాలను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ శ్రేణులపై రౌడీ షీట్లు తెరవడం.. ఆస్తులను ధ్వంసం చేయడం.. పొలాల రీ సర్వే పేరుతో ఇతరుల పేర్లు నమోదు చేయడం.. గ్రామాల్లో ఉద్రిక్తతలు సృష్టించడం లాంటి కుతంత్రాలకు కూటమి నేతలు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పీడీ యాక్ట్‌లను బనాయించి జైలుకు పంపేందుకు కుట్రలు సాగిస్తున్నారని, వీటికి భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తాము జగన్‌మోహన్‌రెడ్డికి కరుడుగట్టిన అభిమానులమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు, లోకేశ్, సోమిరెడ్డి మాటలు విని అధికారులు తప్పులు చేయడం మంచిదికాదని, అధికారం మారాక వీరెవరూ కాపాడలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
రాజ్యాంగబద్ధంగా జరగాలి
ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా జరిగేలా కలెక్టర్, ఎస్పీ చర్యలు చేపట్టాలని కోరారు. అధికార పార్టీ చెప్పినట్లు చేస్తే ఊరుకునేదిలేదని స్పష్టం చేశారు. తన పాలనపై చంద్రబాబుకు నమ్మకం లేక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉండటంతో, పోటీ చేసేందుకు అభ్యర్థుల్లేక ఎన్నికలను గతంలో బహిష్కరిస్తున్నామని ప్రకటించిన అంశాన్ని గుర్తుచేశారు. తమ పార్టీ శ్రేణులను ఎన్ని ఇబ్బందులు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నా, లెక్కచేయకుండా అభ్యర్థులను బరిలోకి దించేందుకు తమ పార్టీ అధినేత సిద్ధంగా ఉన్నారని చెప్పారు. శ్రీశైలం జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు పక్కనబెట్టారని ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతుంటే.. తెలంగాణకు సంబంధించిన పవర్ జనరేషన్, లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట రకరకాలుగా నిత్యం ఆరు టీఎంసీలను దోచుకుపోతున్నా, పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు.
సర్వేపల్లిలో దందాల రాజ్యం
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో దందాల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. లేఅవుట్లు వేస్తే రూ.ఐదు లక్షలు, గ్రావెల్ టిప్పర్ లోడుకు రూ.పది వేలు, ప్రభుత్వ భూముల విక్రయాల్లో రూ.20 లక్షలను డిమాండ్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాకుటూరు శివాలయ భూములను విక్రయించిన వ్యవహారంలో పాత్రపై సోమిరెడ్డి స్పష్టతనివ్వకపోవడమేమిటని ప్రశ్నించారు. కసుమూరులో పట్టాభిరామస్వామి ఆలయ భూము లు, ఎర్రగుంట వద్ద విలువైన ప్రభుత్వ స్థలంలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆక్రమించడం, కాగితాలపూరు రోడ్డు వద్ద ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు యత్నించడంపై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారని చెప్పారు. భూ ఆక్రమణలపై ప్రశ్నించే వారిపై దాడులు చేయించడం దారుణమన్నారు. పొదలకూరు మండలం చిట్టేపల్లి తిప్ప వద్ద గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తుంటే టీడీపీ నేతలే అడ్డుకున్నారని, మీ అవినీతిని సొంత మనుషులే ప్రశ్నిస్తుంటే ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అర్హుడివేనానని ప్రశ్నించారు. వైస్ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, మండల కన్వీనర్ కొణిదెన మోహన్‌నాయుడు, ఎంపీటీసీ వేమారెడ్డి రఘునందన్‌రెడ్డి, నేతలు ఆరుగుంట ప్రభాకర్‌రెడ్డి, ఈపూరు రజనీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను
పక్కనబెట్టిన చంద్రబాబు
భూ ఆక్రమణలపై ప్రశ్నిస్తే దాడులు చేయిస్తారా..?
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి


